Begin typing your search above and press return to search.

ఎంపీ గల్లా జయదేవ్ పై కబ్జా కేసు.. ఏం చేశారు?

By:  Tupaki Desk   |   30 Sept 2021 10:10 AM IST
ఎంపీ గల్లా జయదేవ్ పై కబ్జా కేసు.. ఏం చేశారు?
X
తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆయనతో సహా మొత్తం పన్నెండు మందిపై వివిధ సెక్షన్ల కింద భూఆక్రమణ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు వారిపై పోలీస స్టేషన్ లో కేసులు పెట్టారు. ఇంతకూ ఇదంతా ఎందుకు జరిగింది? దీనికి కారణం ఏమిటి? లాంటి వివరాల్లోకి వెళితే..

చిత్తూరుజిల్లా తవణంపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. గల్లా అరుణకుమారి తండ్రి దివంగత రాజగోపాల్ నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్.. ఎడ్యుకేషన్ సొసైటీల కోసం దిగువమాఘం గ్రామంలో భవనాలు నిర్మించారు. ఆ భవనాల సమీపంలో ఉన్న తన పొలాన్ని అక్రమించారని అదే గ్రామానికి చెందిన రైతు గోపీకృష్ణ కోర్టును ఆశ్రయించారు.

అయితే.. ఈ ప్రయత్నాలు 2015 నుంచి వివిధ రూపాల్లో సాగుతున్నా ఫలితం లేకపోయింది. దీంతో..ఆయన కోర్టును ఆశ్రయించారు. తన భూమిలో ఎంపీ గల్లా జయదేవ్ తో సహా ఆయన కుటుంబ సభ్యులపైనా ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టులో విచారణ చేపట్టారు.

చిత్తూరు నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సదరు ట్రస్ట్ సంబంధీకులతో సహా ఆ గ్రామ బాధ్యులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో.. రాజన్న ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ కమ్ ఛైర్ పర్సన్ కమ్ మాజీ మంత్రి గల్లా అరుణకుమారి.. సభ్యులు గల్లా రామచంద్రనాయుడు.. ఎంపీ గల్లా జయదేవ్.. గల్లా పద్మావతి.. గోగినేని రమాదేవి.. కార్యదర్శి సి. రామచంద్రరాజు.. ఉద్యోగులుఎం. పార్థసారథితో పాటు మరికొందరిపైనా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. వీరితో పాటు న్యాయవాది చంద్రశేఖర్.. సర్పంచ్.. కార్యదర్శులపై కూడా కేసులు నమోదు చేసినట్లుగా చిత్తూరు డీఎస్పీ పేర్కొనటం గమనార్హం.