Begin typing your search above and press return to search.

కారు సారు ఇక రారు.. ఇదెవరి రైమింగ్ అంటే?

By:  Tupaki Desk   |   19 Nov 2020 5:30 AM GMT
కారు సారు ఇక రారు.. ఇదెవరి రైమింగ్ అంటే?
X
గ్రేటర్ ఎన్నికల వేళ.. తెలంగాణ అధికారపక్షానికి చురుకు పుట్టేలా పావులు కదుపుతోంది బీజేపీ. ఇప్పటికే టీఆర్ఎస్ తో ఫైటింగ్ బీజేపీతోనే అన్న విషయాన్నిఅధికారపార్టీతో చెప్పించేసిన కమలనాథులు.. ఇప్పుడు వారిపై విరుచుకుపడేందుకు కసరత్తు చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ నినాదాన్ని.. వారికే పంచ్ పడేలా కొత్త రైమింగ్ మొదలెట్టేశారు. సారు కారు పదహారు అంటూ.. ఎంపీ ఎన్నికల వేళ.. పదహారు లోక్ సభ స్థానాల్ని గులాబీ కారు ఖాతాలో వేయాలన్న అభ్యర్థనతో తీసుకొచ్చిన నినాదాన్ని.. తాజాగా ప్రత్యర్థిపై పంచ్ వేసేందుకు బీజేపీ ఉపయోగిస్తోంది. కారు సారు ఇకరారు అంటూ.. కేసీఆర్ పని అయిపోయిందన్న మాటను సింగిల్ లైన్ లో చెప్పేస్తున్నారని చెప్పాలి.

గ్రేటర్ ఎన్నికల్లో కారును షెడ్డుకు పంపాలంటున్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్.. టీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతల్ని పలువురిని తీసుకురావటం ద్వారా.. బీజేపీ బలోపేతమవుతుందన్న భావన కలిగించాలన్నదే కమలనాథుల ఆలోచనగా చెబుతున్నారు. తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల ఫలితం ఏమవుతుందన్న అంశంపై దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తోందన్నారు.
టీఆర్ఎస్ - మజ్లిస్ దోస్తానాపైనా బీజేపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ను మజ్లిస్ చేతిలో పెడితే ఏమవుతుందన్న విషయాన్ని నగర ప్రజలు ఆలోచించాలని కోరారు. మెజార్టీ ప్రజల హక్కుల కోసం బీజేపీబరాబర్ పని చేస్తుందని తేల్చేసిన బండి.. హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలను అడ్డుకొని తీరుతామన్నారు.

పదిహేను నిమిషాలు పోలీసులను పక్కన పెడితే హిందువుల సంగతి చేస్తానన్న మజ్లిస్ నేతతో కేసీఆర్ చెట్టాపట్టాల్ వేసుకొని తిరగటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. బండి మాటల్ని చూస్తే.. గ్రేటర్ ఎజెండా ఏమిటన్న విషయం క్లియర్ గా అర్థమైపోవటం ఖాయం. మరి.. బీజేపీ నేతలు తాజాగా తెర పైకి తీసుకొచ్చిన కారు సారు ఇకరారు నినాదానికి ఎలాంటి ఫలితం దక్కుతుందన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.