Begin typing your search above and press return to search.

రెండు రోజులుగా చెన్నై ఫ్లైఓవర్ మీదే ఉండిపోయిన ఖరీదైన కార్లు

By:  Tupaki Desk   |   26 Nov 2020 3:30 PM GMT
రెండు రోజులుగా చెన్నై ఫ్లైఓవర్ మీదే ఉండిపోయిన ఖరీదైన కార్లు
X
అప్పుడప్పుడు మాత్రమే వచ్చే అత్యంత ఖరీదైన.. విలాసవంతమైన కార్లు ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చాయి. హడావుడిగా వాటిని తీసుకెళ్లి.. ఫ్లైఓవర్ మీద వరుస పెట్టి పార్కు చేసి వెళ్లిపోయిన వైనం ఇప్పుడుఆసక్తికరంగా మారింది. ఖరీదైన కార్లు ఎక్కడైనా ఇంట్లో సేఫ్ గా ఉంచుకుంటారు కానీ.. ఫ్లైఓవర్ మీద ఎందుకు ఉంచుతారన్న సందేహం కలుగుతుందా? దానికి కారణం లేకపోలేదు.

నివర్ తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉండటం.. భారీగా కురిసిన వర్షాలతో చెన్నైలోని చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. వీటిల్లో సామాన్యులు ఉండే ప్రాంతాలే కాదు.. సంపన్నులు ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయి. లక్షలు పోసికొన్న కార్లు.. నీళ్లల్లో మునిగిపోతే వాటిల్లే నష్టం అంతా ఇంతా కాదు. అందుకే.. కార్లను సేఫ్ గా ఉంచుకోవటానికి తగిన ప్లేస్ వెతికిన చెన్నై వాసులు కొత్త ఐడియా వేశారు. ఇంటి నుంచి తీసుకొచ్చిన కార్లను.. సమీపంలోని ప్లైఓవర్ మీద జాగ్రత్తగా పార్కు చేశారు.

తీవ్రమైన తుపాను కారణంగా భారీ ఎత్తున వర్షాలు రావటంతో.. రోడ్ల మీదకు ఎవరూ వచ్చే అవకాశమే లేదు. వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లైఓవర్లను మూసివేస్తారు. దీంతో.. వాహనాలకు ఎలాంటి నష్టం ఉండదు. ఎంత భారీ వర్షమైనా ఫ్లైఓవర్లు మునిగిపోయే పరిస్థితి ఉండకపోవటంతో..వాటికి మించిన సేఫ్ ప్లేస్ మరేదీ ఉండదని నిర్ణయించుకున్నకార్ల యజమానులు తమ ఖరీదైన కార్లను ఫ్లైఓవర్ల మీద ఉంచేసి వెళ్లిపోయారు. దీంతో.. ఒకదానితో మరొకటి పోటీ పడేలా ఉన్న విలాసవంతమైన కార్లతో ఎప్పుడూ కనిపించని కొత్త సీన్ అందరిని ఆకర్షిస్తోంది.