Begin typing your search above and press return to search.

ఫెరారీ.. లంబోర్గిని.. జాగ్వార్.. కొనకుండానే మీరు ఎంజాయ్ చేయొచ్చు

By:  Tupaki Desk   |   5 April 2021 11:30 AM GMT
ఫెరారీ.. లంబోర్గిని.. జాగ్వార్..  కొనకుండానే మీరు ఎంజాయ్ చేయొచ్చు
X
నిజంగానే నిజం. అత్యంత విలాసవంతమైన ఫెరారీ.. లంబోర్గిని.. బెంట్లీ.. పోర్షే 911.. జాగ్వార్.. రేంజ్ రోవర్.. ఆడి.. వోల్వో.. బీఎండబ్ల్యూ.. ఫోర్డ్ ముస్తాగ్..ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 30కి పైనే మోడల్స్.. మీ కోసం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎదురుచూస్తున్నాయి. దేశంలో మరే ఎయిర్ పోర్టులో లేని విధంగా అత్యంత విలాసవంతమైన కార్లలో ప్రయాణించే అవకాశం శంషాబాద్ ఎయిర్ పోర్టు కల్పిస్తోంది.

సాధారణంగా విలాసవంతమైన కార్లలో ప్రయాణం చాలామందికి సాధ్యం కాదు. ఎక్కడిదాకానో ఎందుకు.. ఫెరారీ విషయానికే వద్దాం. దేశంలో అతి తక్కువ మంది పారిశ్రామికవేత్తల వద్దే ఉన్నాయి. అలాంటి కారులో ప్రయాణించేందుకు మీరు వాటిని కొనాల్సిన అవసరం లేదు. మీ దగ్గర కాస్త డబ్బులు ఉంటే చాలు. ఆ కారులో ప్రయాణించే వీలుంది. ఇది కేవలం హైదరాబాదులో మాత్రమే సాధ్యం.

కొన్ని ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ సంస్థలు దేశంలో తొలి సారి శంషాబాద్ విమానాశ్రయంలో ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాయి. ఫ్లైట్ దిగి అరైవల్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్కు వద్దకు వచ్చి ఈ లగ్జరీ కార్లను బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఓయాసిస్.ఇన్ సైట్లోనూ బుక్ చేసుకునే వీలుంది. కార్లు.. దాని బ్రాండ్లు అదిరిపోతున్నాయ్. మరి.. దానికి చెల్లించే మొత్తం మాటేమిటంటారా? మరి కారుకు తగ్గట్టే రెంట్ కదా.

ఉదాహరణకు ఫెరారీ కారు విషయాన్నే తీసుకుందాం. దీన్ని కొనుగోలు చేయాలంటే రూ.4.97 కోట్లు అవసరం. దేశంలో చాలా తక్కువమంది వ్యాపారవేత్తలు మాత్రమే ఈ కారును వినియోగిస్తుంటారు. అలాంటి ఈ లగ్జరీ కారును అద్దెకు తీసుకునే అవకాశం ఉంది.

లంబోర్గిని కారులో డ్రైవర్ తో సహా 10 కి.మీ. ప్రయాణానికి రూ.22వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి కి.మీ. దూరానికి రూ.706.. గంటకు రూ.22వేలు చొప్పున అదనంగా వసూలు చేయటానికి అవకాశం ఉంది. డ్రైవర్ కు వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారులో సెల్ఫ్ డ్రైవింగ్ తో ప్రయాణానికి ముందుగా లక్ష రూపాయిల డిపాజిట్.. గంటకు రూ.5వేలు చొప్పున అద్దె చెల్లించాలి. ఇందుకు 10కి.మీ. దూరం ప్రయాణించొచ్చు. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్ కు రూ.177 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మరెందుకు ఆలస్యం..ఒక్కసారి ట్రై చేస్తారా?