Begin typing your search above and press return to search.

ఈటల పై కార్ డ్రైవర్ - క్లీనర్ పోటీ

By:  Tupaki Desk   |   21 Nov 2018 10:34 AM GMT
ఈటల పై కార్ డ్రైవర్ - క్లీనర్ పోటీ
X
వివిధ పార్టీల నేతల ఎన్నికల ప్రచారాలతో తెలంగాణలో రాజకీయ వేడి రగులుకుంటోంది. ఈ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసిన వేళ ఎన్నో అనూహ్యమైన - చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ ఆపద్ధర్మ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పోటీచేస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన డ్రైవర్ - మరియు క్లీనర్ లు కూడా ఆయనపై తిరుగుబాటు చేసి పోటీదారులుగా నిలబడడం విశేషం.

వీరి పోటి వెనుక కథను ఒక్కసారి చూస్తే.. కారు డ్రైవర్ మల్లేష్ కొద్ది నెలల కిందటి వరకు ఈటల రాజేందర్ డ్రైవర్ గా చేశారు. ప్రశాంత్ క్లీనర్ గా పనిచేశాడు. ఇద్దరూ ఈటెల రాజేందర్ - టీఆర్ ఎస్ పార్టీ పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. డ్రైవర్ మల్లేష్ ఉద్యమ సమయంలో జైల్లో రెండు నెలలు ఉన్నప్పుడు కనీసం ఈటెల బయటకు తీసుకొచ్చే సాయం కూడా చేయలేదట.. ప్రశాంత్ ను కూడా వాడుకొని వదిలేయడంతో ఆయన ఈటలపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో తాజాగా ఇద్దరు ఈటలపై స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ ఎస్ కు అండగా ఉన్నా తమను పట్టించుకోని వైనంపై వారిద్దరూ ఈటెలపై పోటీకి సిద్ధమయ్యారు.

వీరేకాదు.. ఈటెల న్యాయ కేసులు చూసే లాయర్ బండి కలాధర్ కూడా ఈసారి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అయితే కళాధర్ కు ఈటెల అన్నా టీఆర్ ఎస్ అన్నా పెద్ద కోపం.. పగలు లేవు. ఆయన ఎమ్మెల్యేగా కావాలన్నా ఆకాంక్షతోనే బరిలోకి దిగుతున్నట్టు సమాచారం.

ఈ పరిణామాలన్ని చూసిన ఈటల రాజేందర్ తనపై కాంగ్రెస్ కుట్ర పన్నిందని.. తన వ్యతిరేకులను పోగు చేసి వారి చేత నామినేషన్ వేయించి నియోజకవర్గంలో తప్పుడు ప్రచారం చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే ఇదివరకటిలా ఈటలకు హుజూరాబాద్ లో విజయం అంత ఈజీగా దక్కేలా లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.