Begin typing your search above and press return to search.

యాక్సిడెంట్: నలుగురు సజీవ దహనమయ్యారు

By:  Tupaki Desk   |   14 Dec 2015 6:05 AM GMT


చిన్న నిర్లక్ష్యం ఎంతటి దారుణానికి కారణమవుతుందని సంగతి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం స్పష్టం చేస్తుంది. కారు.. ఆటో ఢీ కొంటే ప్రమాద తీవ్రత ఉంటుంది. కానీ.. ఆటోలో ప్రయాణిస్తున్న వారు సజీవ దహనమయ్యేంతలా ఉండదు. ఆదివారం రాత్రి జరిగిన ఘటనలో అందుకు భిన్నంగా.. యాక్సిడెంట్ అయిన వెంటనే.. కారు.. ఆటో రెండు పూర్తిగా దగ్థమయ్యాయి. దీంతో.. ఆటో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు సజీవ దహనం కాగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద తీవ్రత ఈస్థాయిలో ఉండటానికి కారణం.. ఆటోలో ఉన్న పెట్రోల్ క్యానే. ఆటోలో ఉన్న పెట్రోల్ క్యాన్ ప్రమాదంతో పగిలిపోవటంతో.. కిందకు ఒలికిన పెట్రోలు మంటలు రేగటంతో ప్రమాద తీవ్రత భారీగా ఉంది. కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలోని పొట్యాల గ్రామ సమీపానికి వచ్చిన వెంటనే ఎదురుగా వస్తున్న ఆటోను కారు ఢీ కొట్టింది.

హటాత్తుగా చోటు చేసుకున్న ఈ ఘటనలో కారు వెనుక వస్తున్న బైక్ ఢీ కొంది. దీంతో.. ఆటోలో ఉన్న పెట్రోల్ డబ్బా కింద పడి బయటకు విరజిమ్మింది. దీంతో.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరొకరిని కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ఒక చిన్న అజాగ్రత్త ఘోర ప్రమాదానికి కారణం కావటం గమనార్హం. ఆటోల్లో ప్రయాణించే సమయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.