Begin typing your search above and press return to search.

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద ప్రమాదం.. ఎలా జరిగిందంటే?

By:  Tupaki Desk   |   5 Nov 2020 2:30 PM GMT
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద ప్రమాదం.. ఎలా జరిగిందంటే?
X
హైదరాబాద్ మహానగరానికి సరికొత్త ఇమేజ్ ను తెచ్చి పెడుతున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఇటీవల ప్రారంభం కావటం తెలిసిందే. గత అనుభవాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ.. సైబరాబాద్ పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వీకెండ్లలో ఈ వంతెన మీదకు వాహనాల్ని అనుమతించటం లేదు. ఇక్కడి లేజర్ లైటింగ్ తో పాటు.. కొత్త అందాలతో మెరిసిపోతున్న ఈ కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వందలాది మంది నిత్యం తరలి వస్తున్నారు. వీకెండ్స్ లో అయితే.. రద్దీ మరింత పెరుగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం కేబుల్ బ్రిడ్జి మీద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వాస్తవానికి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నా.. లక్కీగా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. బ్రిడ్జి మీద ప్రయాణిస్తున్న వేళ కారు టైరు బ్లాస్ట్ కావటంతో కారు అదుపు తప్పింది. ఆ వెంటనే బ్యాలెన్స్ కోల్పోయి పల్టీ కొట్టింది. ఆ సమయంలో కారు వేగంతో ఉండటంతో డివైడర్ ను ఢీ కొట్టింది.

లక్కీగా ఆ సమయంలో కేబుల్ బ్రిడ్జి మీద రద్దీ పెద్దగా లేకపోవటంతో పెనుప్రమాదం తప్పిందని చెప్పాలి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదం నేపథ్యంలో స్పందించిన పోలీసులు.. వెంటనే వాహనాన్ని తరలించారు. సెప్టెంబరు 25న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కేబుల్ వంతెన.. లాక్ డౌన్ వేళ నగరవాసులకు పర్యాటక కేంద్రంగా మారిందని చెప్పాలి. పెద్ద ఎత్తున నగర ప్రజలు ఇక్కడకు వస్తున్నారు. అయితే.. నిబంధనలకు విరుద్ధంగా వంతెన మీద వాహనాల్ని నిలపవటం.. ప్రమాదకరంగా వ్యవహరిస్తూ సెల్ఫీలు.. ఫోటోలు దిగుతున్నారు. అయితే.. సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన కెమేరాలతో.. ఇలాంటి వారిని ఎప్పటికిప్పుడు హెచ్చరిస్తున్నారు. అనూహ్యంగా ఈ రోజు ప్రమాదం చోటు చేసుకుంది.