Begin typing your search above and press return to search.

కేసీఆర్ తో పోటీ.. అభ్యర్థి ఆచూకీ గల్లంతు

By:  Tupaki Desk   |   27 Nov 2018 7:19 AM GMT
కేసీఆర్ తో పోటీ.. అభ్యర్థి ఆచూకీ గల్లంతు
X
సీఎం కేసీఆర్ పోటీలో ఉన్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్ నెలకొంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గట్టి పోటీనిస్తున్నారు. అయితే కేసీఆర్ కు పోటీగా గజ్వేల్ బరిలో నిలిచిన ఓ పార్టీ అభ్యర్థి గల్లంతు కావడం కలకలం రేపుతోంది. ఆయన్ను వెతికి పట్టుకోవాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు పోలీసులను తాజాగా ఆదేశించడం సంచలనం రేపుతోంది..

సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ (ఎస్ ఎఫ్.బీ) పార్టీ తరుపున కే. దినేష్ చక్రవర్తి అనే అభ్యర్థి సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా గజ్వేల్ లో నవంబర్ 22న నామినేషన్ దాఖలు చేశారు. వచ్చే డిసెంబర్ 7న ఎన్నికల కోసం ఆయన అంతకుముందు ప్రచారానికి కూడా దిగారు. అయితే తాజాగా ఎస్ ఎఫ్.బీ అధ్యక్షుడు మురళీధర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. నామినేషన్ వేసిన అనంతరం తమ అభ్యర్థి దినేష్ చక్రవర్తి కనిపించడం లేదని ఫిటీషన్ వేశారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక సీటులో నామినేషన్ వేయడంతోనే ఆయన గల్లంతు అయ్యారని.. ఆయన్ను వెంటనే వెతికిపెట్టేలా ఆదేశాలివ్వాలని హైకోర్టుకు విన్నవించారు.

అయితే ఆశ్చర్యకరంగా నామినేషన్ వేసిన తెల్లవారి నవంబర్ 23 నుంచి ఈ అభ్యర్థి గురించి ఏ రికార్డు ఎన్నికల కమిషన్ వద్ద లేనట్టు చూపిస్తుండడం గమనార్హం. కేసీఆర్ పై పోటీ చేస్తున్న కారణంగానే అతడు అదృశ్యమయ్యాడని.. దీనివెనుక తమకు సందేహాలున్నాయని పిటీషనర్ మురళీధర్ రావు తెలిపారు. మరి కేసీఆర్ పై బరిలోకి దిగిన దినేష్ ఏమయ్యాడు.? ఎక్కడున్నాడన్నది హాట్ టాపిక్ గా మారింది.