Begin typing your search above and press return to search.

వీసాల విష‌యంలో మ‌నోళ్ల‌కు ఆ దేశం వెల్‌ కం

By:  Tupaki Desk   |   26 Jun 2018 7:47 AM GMT
వీసాల విష‌యంలో మ‌నోళ్ల‌కు ఆ దేశం వెల్‌ కం
X
అగ్ర‌రాజ్యం అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం భారతీయులపై వివక్ష పూరితంగా వ్యవహరిస్తుంటే మరోవైపు దాని పొరుగు దేశమైన కెనడా మాత్రం భారత విద్యార్థులకు ఘనస్వాగతం పలుకుతోంది. భారత్‌ తోపాటు మరో మూడు దేశాల విద్యార్థులు వేగంగా వీసాలు పొందేలా కెనడా నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. కెనడాలో చదువుకోవాలనుకునే వారికి ప్రస్తుతం జారీ చేస్తున్న వీసా విధానంలో భారీ మార్పులు చేయడంతోపాటు వీసా జారీ ప్రక్రియ సమయాన్ని తగ్గించింది. అధికారిక లెక్కల ప్రకారం లక్ష మంది భారతీయ విద్యార్థులు కెనడాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. విద్యా అనుమతుల కోసం పెరుగుతున్న దరఖాస్తులకు మద్దతుగా నిలువడంతోపాటు భారత్ - చైనా - వియత్నాం - ఫిలిప్పీన్స్ దేశాల విద్యార్థులకు మేలు చేకూరేలా కెనడా వలస, శరణార్థి, పౌరసత్వ విభాగం స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీం (ఎస్‌ డీఎస్) విధానాన్ని ప్రకటించింది.

ఇటీవ‌లే బ్రిటన్ యూనివర్సిటీల్లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం వీసా నిబంధనలను మరింత సడలించింది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ విధానంలో చేసిన సవరణలను బ్రిటన్ హోం శాఖ శుక్రవారం పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టింది. విదేశీ విద్యార్థులకు టైర్-4 వీసా నిబంధనలను మరింత సరళతరం చేస్తున్నట్టు తెలిపింది. ఈ సడలింపులను 25 దేశాలకు పరిమితం చేస్తూ వాటిని తక్కువ ప్రమాద దేశాలుగా అభివర్ణించింది. అయితే ఈ జాబితాలో భారత్‌కు మాత్రం చోటు కల్పించలేదు. బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భారతీయులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి స‌మ‌యంలో కెన‌డా తీపిక‌బురు అందించింది.

కెనడా వలస - శరణార్థి - పౌరసత్వ విభాగం స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీం (ఎస్‌ డీఎస్) విభాగంలో విద్యార్థులు ప్రవేశాలు కోరుకుంటే వారికి అదనపు అర్హతలు ఉండాలి. ఈ వ్యవస్థ ద్వారా కెనడాకు వెళ్లే విద్యార్థులకు శాశ్వత నివాసం - పౌరసత్వం విషయంలో ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ ఎస్‌ డీఎస్‌ కు అవసరమయ్యే సమాచారం విద్యార్థుల వద్ద లేకపోతే సాధారణ విద్యా అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ డీఎస్ కింద వీసా దరఖాస్తు ప్రక్రియకు కేవలం 45 నుంచి 60 రోజుల సమయం మాత్రమే పడుతుందని తెలుస్తోంది.