Begin typing your search above and press return to search.

కెన‌డాలో ఇండియన్ కేబినెట్

By:  Tupaki Desk   |   6 Nov 2015 12:31 PM IST
కెన‌డాలో ఇండియన్ కేబినెట్
X
భారత సంతతి సిక్కులు కెనడాలో చరిత్ర సృష్టించారు. న‌లుగురు సిక్కులు కెనడా కొత్త ప్రధాని జస్టిన్ మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణం చేశారు. అంతేకాదు... కెనడా పార్లమెంటుకు ఏకంగా 27 మంది సిక్కులు ఎన్నికయ్యారు. 42 ఏళ్ల హర్జిత్ సజ్జన్ ఆ దేశ రక్షణ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. సైన్స్ అండ్ ఎకనామిక్ డెవలప్‌ మెంట్ శాఖను 38 ఏళ్ల నవదీప్ భైంస్ కు కేటాయించారు. అమర్జీత్ సోహి మౌళికసదుపాయాల శాఖకు మంత్రిగా ప్రమాణం చేశారు. మరో సిక్కు మహిళ బర్దీష్ జాగర్ కూడా మంత్రివర్గంలో చేరారు. ఆమెకు టూరిజం శాఖను కేటాయించారు. కెనడాలో సిక్కుల జోరు చూస్తుంటే అక్కడ మరో ఇండియాన సృష్టించేలా ఉన్నారు. 27 మంది సిక్కులు పార్లమెంటుకు ఎన్నికవడంతో కెనడా రాజకీయాల్లో కొత్త చరిత్ర లిఖించినట్లయింది.

అంతేకాదు అత్యంత కీలకమైన రక్షణ శాఖను భారతీయుడికే అప్పగించారు. కెనడా నూతన రక్షణశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన హర్జిత్ సజ్జన్ భారత్ లోనే పుట్టి అయిదేళ్ల వరకు ఇక్కడే పెరిగారు. ఆయనకు అయిదేళ్ల వయసప్పుడే ఆ కుటుంబం కెనడా వెళ్లింది. లెఫ్టినెంట్ కల్నల్‌ గా కెనడా ఆర్మీలో పనిచేసిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో వాంకోవర్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. కెనడా సైన్యంలో విశేష సేవలందించిన సజ్జన్ గతంలో బోస్నియాతోపాటు ఆఫ్గనిస్థాన్‌ లోని కాందహార్‌ లో పనిచేశారు. అంతర్జాతీయంగా యుద్ధరంగంలో అనుభవం ఉండడంతో ఆయన్ను రక్షణ మంత్రిగా తీసుకున్నారు.