Begin typing your search above and press return to search.

నీటి లొల్లి ఎందుకు? ఇద్దరు సీఎంలు కలిసి మాట్లాడుకోవచ్చుగా?

By:  Tupaki Desk   |   2 July 2021 10:30 AM GMT
నీటి లొల్లి ఎందుకు? ఇద్దరు సీఎంలు కలిసి మాట్లాడుకోవచ్చుగా?
X
ప్రజాక్షేమమే ముఖ్యమైనప్పుడు.. ఆ దిశగా అడుగులు వేయాల్సిన బాద్యత పాలకుల మీద ఉంటుంది. అకస్మాత్తుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి తగువు లెక్కను తీర్చుకోవటానికి బదులు.. ఒకరి మీద మరొకరు మాటలు అనేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయాలేవీ మన ముఖ్యమంత్రులకు తెలియనిది కాదు. మరి.. నీటి లొల్లి అంతకంతకూ పెరిగిపోతూ.. రెండు రాష్ట్రాల్లోని క్రిష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల వద్ద పెద్ద ఎత్తున బలగాల్ని మొహరించటం ఎందుకు? ఉద్రిక్త వాతావరణాన్ని అంతకంతకూ పెంచటం ఎందుకు?

గతంలోనూ ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవటం.. ఒకదశలో రెండురాష్ట్రాలకు చెందిన పోలీసులు కొట్టుకోవటం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఒక అడుగు ముందుకేసి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేయటం.. వారి మధ్య జరిగిన చర్చల్లో ఇష్యూ క్లోజ్ అయ్యింది. ఇప్పుడు అదే పద్దతిలోకి వెళ్లొచ్చు కదా? రెండు రాష్ట్రాల మధ్య ఫ్యాక్షన్ పంచాయితీలు ఏమీ లేవు కదా?

విడిపోయిన తర్వాత అరమరికలు లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ప్రజల మధ్య ఎలాంటి వైషమ్యాలు లేకుండా సాగుతున్నప్పుడు.. ప్రభుత్వాల మధ్య పంచాయితీలు అవసరం లేదు కదా? ఒకవేళ తప్పులు జరుగుతుంటే.. కూర్చొని మాట్లాడుకొని ఇష్యూను సాల్వ్ చేస్తే సరిపోతుంది కదా? ఆ ప్రయత్నం ఎందుకు జరగటం లేదు?

ఈ విషయంలో ముందుగా ఎవరు చొరవ తీసుకోవాలన్నదే ప్రశ్న అయితే.. వయసులోనూ.. అనుభవంలోనూ పెద్దోడు అయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుంటే సరిపోతుంది. అదే సమయంలో వయసులో చిన్న అయినప్పటికీ.. అందరూ బాగుండాలని భావించే ఏపీ సీఎం జగన్ ముందుకు వచ్చినా తప్పేం కాదు. ఏది ఏమైనా ముఖ్యమంత్రులు ఇద్దరిలో ఎవరు ముందుకొచ్చినా రెండోవాళ్లు నో చెప్పే ఛాన్సు లేదు. సమస్యల్లా ఇద్దరు ముఖ్యమంత్రుల్లో మొదటగా ముందుకొచ్చే వారెవరు? అన్నదే ప్రశ్న. రెండు రాష్ట్రాల మధ్య ఏదో జరిగిపోతుందనే భావన ప్రజల్లో కలిగించే కన్నా.. ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.