Begin typing your search above and press return to search.

గంజాయి మొక్కను ఇలా కూడా వాడొచ్చా? విలువైన ఉత్పత్తులివీ

By:  Tupaki Desk   |   22 Aug 2022 8:00 AM IST
గంజాయి మొక్కను ఇలా కూడా వాడొచ్చా? విలువైన ఉత్పత్తులివీ
X
గంజాయి మొక్క. దీని సాగు తెలుగు రాష్ట్రాల్లో నిషేధం. ఎందుకంటే మత్తు పదార్థాలకు ఈ మొక్కను పెంచుతారు. అనైతికంగా దీని ఆకులను వాడుతారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు చట్ట విరుద్ధం. కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు. ఇదొక మత్తు మందు ఇచ్చే మొక్కగానే చాలా మంది చూస్తారు. కానీ ఈ ప్రకృతిలోని ప్రతి మొక్కతోటి మానవాళికి ఉపయోగాలున్నాయి. దాన్ని చెడుకు వాడకుండా మంచికి వాడితే సత్ఫలితాలు వస్తాయి. దాన్ని మనం ఎలా వాడుకుంటున్నామన్నదే ముఖ్యం.

గంజాయి మొక్కను మత్తు కోసం కాకుండా అనేక రకాల మంచి కోసం కూడా వాడుకోవచ్చని ఒక స్టార్టప్ కంపెనీ నిరూపించింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో 14వేల ఎకరాలకుపైనే గంజాయి సాగవుతోందని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల తెలంగాణలో కూడా గంజాయి కేసులు ఎక్కువ అవుతున్నాయి. చట్టబద్ధం కాని ఈ సాగు మీద ఎందుకింత మోజు అంటే.. గంజాయి పంట ఎకరానికి రెండు సీజన్లలో దాదాపు రూ.50 లక్షల వరకూ ఆదాయం వస్తుందని కొందరు అంటున్నారు.

దట్టమైన అటవీ ప్రాంతాల్లో.. మనుషులు, పోలీసులు, అధికారులు వెళ్లని చిన్న చిన్న గిరిజన గ్రామాల్లో వరి, పసుపు, ఆపరాలు వంటి చిరుధాన్యాల మధ్య గంజాయి మొక్కలను పెంచుతుంటారు. ఒకప్పుడు మన్యం గ్రామాల్లో వందల ఎకరాల్లోనే గంజాయి తోటలు కనిపించేవి. కానీ ఇప్పుడు సాగు వేల ఎకరాల్లోకి విస్తరించిందని పార్వతీపురంలోని ఓ స్వచ్ఛంద సంస్థ అంచనావేస్తోంది. ఏపీలోని గిరిజన గూడాల్లో ఎక్కువగా శీలావతి రకం గంజాయి తోటలే ఉన్నాయి.

గంజాయి అంటే కేవలం మత్తు మందేనా? ఆ మొక్కల వల్ల వేరే ఉపయోగాలు లేవా? అనే కోణంలో ఉత్తరాఖండ్ కు చెందిన హిమాలయన్ హెంప్ సంస్థ అధ్యయనం చేసింది. గంజాయి మొక్కల నుంచి నారను తీసి అనేక పర్యావరణ హిత వస్తువులను తయారు చేయవచ్చని సంస్థ చెబుతోంది.

ఆ స్టార్టప్ కంపెనీ తయారు చేసిన ఉత్పత్తులను ఇటీవల హైదరాబాద్ లో పరిచయం చేశారు నిర్వాహకులు. గంజాయి అంటే కేవలం మత్తు మందు మాత్రమే కాదని.. ఆ మొక్కల నుంచి విలువైన ఉత్పత్తులను తయారు చేయవచ్చు అంటూ పర్యావరణ ఇంజినీర్ దిలీప్ తెలిపారు. ఈ సంస్థ గంజాయి నుంచి వివిధ రకాల ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు తయారు చేస్తోంది.

గంజాయి నారతో యువతుల కోసం శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్నారు. మార్కెట్లో దొరికేవి ఎక్కువ సేపు ఉంటే అనేక వ్యాదులకు కారణం అవుతాయి. అందుకే గంజాయి నారతో తయారు చేసే ప్యాడ్ లు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయని సంస్థ తేల్చింది. ఇవి పర్యావరణ హితం అని చెబుతోంది. చాలా చౌకగా తయారు చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లో ఫ్యాక్టరీని నెలకొల్పినట్టు సంస్థ తెలిపింది.

ఇక గంజాయి కలపతో ఇటుకలు తయారు చేసి ఇళ్లు కూడా కట్టవచ్చని హెంప్ సంస్థ చెబుతోంది. ఇలా మత్తునిచ్చే మొక్క నుంచి ఎన్నో విలువైన వస్తువులను తయారు చేయవచ్చని ఆసంస్థ చెబుతోంది.