Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు అభ్యర్థియే కరువాయే

By:  Tupaki Desk   |   7 Sep 2021 11:30 PM GMT
హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు అభ్యర్థియే కరువాయే
X
హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడడంతో కాంగ్రెస్ బతికిపోయింది. ఎందుకంటే ఆ పార్టీకి హుజూరాబాద్ లో అసలు అభ్యర్థినే లేకుండా పోయాడు. ఎవరిని నిలబట్టాలన్న దానిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతున్న వేళ ఈసీ ఎన్నికలను పండుగల తర్వాతకు మార్చడంతో కాంగ్రెస్ ఊపిరి పీల్చుకుంది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఇంకా చిక్కు ముడి వీడడం లేదు. ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎవరూ పోటీ చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. తెరపైకి రోజుకో పేరు వస్తున్నా.. ఫైనల్ గా వారు ఖరారు కాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. మొన్నటి వరకు కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ పేరు దాదాపుగా ఖరారైందన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ హుజూరాబాద్ లో పోటీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని టీపీసీసీ వర్గాలు ప్రకటన చేయడంతో పార్టీ శ్రేణులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. చివరిలోనైనా కాంగ్రెస్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తుందా..? లేదా..? అన్న చర్చ తెరపైకి వస్తోంది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాసయాదవ్ పేరును ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇక్కడ పార్టీ గెలుస్తుందా..? లేదా..? అన్న విషయం పక్కనబెడితే క్యాడర్ ను కాపాడడం కోసం.. పరువు దక్కించుకునేందుక పోటీ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా తరువాత ఆయన బీజేపీలోకి వెళ్లారు. ఆ తరువాత ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పటికే కాంగ్రెస్ పరిస్థితి దిగజారడంతో ఇక్కడ పోటీకి ముందుకు రాదనే అనుకున్నారు. కానీ టీపీసీసీ కొత్త పాలక వర్గం ఏర్పడిన తరువాత హుజూరాబాద్ లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత హుజూరాబాద్ ఉప ఎన్నిక సవాల్ గా తీసుకున్నారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ ను బరిలోకి దించితేనే పార్టీ పరువు దక్కుతుందని నిర్ణయించుకున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపు పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. అయితే ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడంతో ఆయనతో పాటు చాలా మంది కాంగ్రెస్ ను వీడారు. దీంతో క్యాడర్ తక్కువైంది. కానీ రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడయ్యాక కొత్త ఉత్సాహం నెలకొంది. అంతేకాకుండా హుజూరాబాద్ బాధ్యతలను దామోదర నర్సింహకు అప్పగించడంతో ఆయన కొన్ని రోజుల కిందట వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ఒక దశలో చేయి పార్టీ భారీగానే ఓట్లు చీల్చుతుందా..? అన్న చర్చ కూడా ప్రారంభమైంది.

అయితే పార్టీ తరుపున బరిలోకి దిగడానికి ఎవరూ ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మొదట్లో దామోదర నర్సింహా పేరు వినిపించగా వెంటనే ఆయన ఒప్పుకోలేదు. ఆ తరువాత పొన్నం ప్రభాకర్ ను కలిసి పోటీ చేయాలని కొందరు నాయకులు సంప్రదించారు. కానీ ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన పొన్నం మరోసారి ఓడిపోతే కష్టం అని చెప్పినట్లు తెలిసింది. దీంతో మాజీ మంత్రి కొండా సురేఖ ను సంప్రదించారు. కొండా సురేఖ షరతులను ఒప్పుకుంటనే హుజూరాబాద్ లో పోటీ చేస్తానని తెలిపింది. దీంతో కొందరు సీనియర్ నాయకులు అందుకు ఒప్పుకోలేదు. వెంటనే టీపీసీసీ కార్యవర్గం గాంధీ భవన్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.

హుజూరాబాద్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావాలని దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే పలు ప్రాంతాల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. అంతేకాకుండా రూ. 5 వేలు డిపాజిట్ అని చెప్పినా చాలా మంది ఉత్సాహం చూపించారు. అయితే హూజూరాబాద్ నియోజకవర్గ పార్టీ నాయకులు మాత్రం లోకల్ అభ్యర్థికే అవకాశం ఇవ్వాలంటున్నారు. లేకుండా పార్టీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంటున్నారు.