Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో కరోనా రోగి వద్ద కాలింగ్ బెల్..

By:  Tupaki Desk   |   7 Aug 2020 3:20 PM IST
ఆ రాష్ట్రంలో కరోనా రోగి వద్ద కాలింగ్ బెల్..
X
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది చాలా పాత మాట. కానీ.. ఎప్పటికప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాల్ని నిశితంగా పరిశీలిస్తున్నప్పుడు.. బోలెడన్ని ఐడియాలు కనిపిస్తుంటాయి. అన్ని మనకు రాకున్నా.. ఒకడి ఐడియాను కాస్త ఇంప్రూవ్ చేయటం ద్వారా జనాలకు మంచి జరుగుతుంటే.. అంతకు మించి కావాల్సిందేముంది? ఇప్పుడు అలాంటిదే ఒకటి పక్కనున్న ఏపీలో అమలు చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు ఒక పక్క.. మరోవైపు వారికి వైద్యం చేసే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులు మహా ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ క్రమంలో..వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నా.. కంప్లైంట్లు మాత్రం ఆగట్లేదు.

ఈ నేపథ్యంలో.. ఒక కొత్త ఐడియాను ఏపీ సర్కారు సిద్ధం చేసింది. కరోనా పేషెంట్ల బెడ్ల దగ్గర కాలింగ్ బెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఐసీయూ.. ఆక్సిజన్ వార్డుల్లో ఈ గంటల్ని ఏర్పాటు చేయటం ద్వారా మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు వైద్యుల్ని.. వైద్య సిబ్బందిని పిలుస్తున్నా పట్టించుకోని పరిస్థితి. దీంతో.. అలాంటి వారిలో కదలిక తెచ్చేందుకు కాలింగ్ బెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

తమకు అవసరమైన వెంటనే పేషెంట్ కాలింగ్ బెల్ నొక్కితే సరిపోతుంది. ఈ బజర్ వార్డులో గంట మోగటమే కాదు.. లైటు కూడా వెలుగుతుంది. వైద్యుడు కానీ వైద్య సిబ్బంది కానీ వచ్చి.. రోగులకు అవసరమైనవి పరిశీలించే వరకు లైటు వెలగటంతో పాటు.. బజర్ మోగుతుంది. ఇలా చేయటం ద్వారా.. పేషెంట్ల విషయంలో మరింత అలెర్టు గా ఉండేందుకు సాయం చేస్తుందని చెబుతున్నారు. తెలంగాణ లో కూడా ఈ విధానాన్ని అమలు చేయటం ద్వారా.. వైద్యులు.. వైద్యసిబ్బంది నిర్లక్ష్యాన్ని అధిగమించే వీలుందని చెప్పక తప్పదు.