Begin typing your search above and press return to search.

ఏపీ సర్కారుకు సాయం చేయాలంటే 9392903400 నెంబరుకు ఫోన్ చేస్తే చాలు

By:  Tupaki Desk   |   14 Jan 2021 3:31 AM GMT
ఏపీ సర్కారుకు సాయం చేయాలంటే 9392903400 నెంబరుకు ఫోన్ చేస్తే చాలు
X
ఏపీలో ఇటీవల కాలంలో అదే పనిగా దేవతామూర్తులపై దాడులకు పాల్పడిన దుర్మార్గుల ఆట కట్టించేందుకు వీలుగా ఏపీ సర్కారు పలు మార్గాల్ని అన్వేషిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని స్వాగతించేది లేదన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడిస్తోంది. విగ్రహాల్ని ధ్వంసం చేసే వారి ఆచూకీ కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున గాలిస్తున్న పోలీసులు.. మరో ఎత్తుగడను తెర మీదకు తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన దేవాలయాల దాడులకు సంబంధించిన విచారణను సీఐడీకి అప్పజెప్పని విషయం తెతలిసిందే.

అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా గుళ్ల మీద జరిగిన దాడుల గురించి వివరాల్ని సేకరించేందుకు సీఐడీ సిద్ధమవుతోంది. గడిచిన మూడు నెలలుగా ఏపీ వ్యాప్తంగా పలు గుళ్లపై జరిగిన దాడుల వెనుక ఉన్న అసలు సంగతుల్ని లెక్క తేల్చేందుకు నడుంబిగించిన ఏపీ పోలీసులు.. తాజాగా ఒక ఫోన్ నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చారు. దాడులకు పాల్పడే అసాంఘిక శక్తులు.. ఆల్లరి చేష్టలకు సంబంధించిన చర్యల్ని అరికట్టేందుకు వీలుగా 9392903400 నెంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

సామాజిక బాధ్యతగా భావించి..ఎవరికైనా గుళ్లు.. దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వారి సమాచారం తెలిస్తే.. ఆ వివరాల్ని షేర్ చేసుకోవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతారు. ఇదిలా ఉండగా.. ఆలయాల దాడి కేసులకు సంబంధించి ఇప్పటివరకు 355 మందిని అరెస్టు చేసినట్లుగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

2020-2021 మధ్యలో ఆలయాలకు సంబంధించి 44 పెద్ద ఘటనలు జరిగాయని.. వీటిల్లో 29 కేసుల్ని చేధించినట్లు చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 58,871 ఆలయాలకు జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేశామన్నారు. 43,824 సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచామన్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన విచారణ కోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీనికి ఐపీఎస్ అధికారి జీవీ అశోక్ కుమార్ నేతృత్వం వహిస్తారు. ఈ కేసుకు అవసరమైన సిబ్బందిని డీజీపీతో నేరుగా మాట్లాడి తీసుకునే అవకాశం కల్పించారు.