Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ కు షాకిచ్చిన కాగ్‌..బీజేపీకి కొత్త అస్త్రం

By:  Tupaki Desk   |   8 Aug 2018 3:34 PM GMT
కాంగ్రెస్‌ కు షాకిచ్చిన కాగ్‌..బీజేపీకి కొత్త అస్త్రం
X
ఇటీవ‌లి కాలంలో బీజేపీపై దూకుడుగా ఎదురుదాడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ త‌గిలింది. ఏ అంశం ఆధారంగా అయితే అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తుందో...అదే అంశం ఆధారంగా కాంగ్రెస్ బుక్క‌య్యే ప‌రిణామం చోటుచేసుకుంది. యూపీఏ-2 ప్రభుత్వం(2009లో) నిబంధనలకు విరుద్ధంగా అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ నుంచి గస్తీ విమానాలను కోనుగోలు చేసిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తేల్చిచెప్పింది. ఈ మేర‌కు పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ స్ప‌ష్టం చేసింది. రాఫెల్ డీల్ వ్య‌వ‌హారంలో బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ ప‌రిణామంతో అవాక్క‌వ‌గా...హ‌స్తం పార్టీని ఎదుర్కునేందుకు బీజేపీ స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.

కాగ్ స‌మ‌ర్పించిన నివేదిక ప్ర‌కారం సముద్ర గస్తీ కోసం ఉప‌యోగించే పీ-8ఐ విమానాల విష‌యంలో పొర‌పాటు జ‌రిగింద‌ని సమ‌ర్పించింది. ఉద్దేశ‌పూర్వ‌కంగా బోయింగ్‌కు మేలు చేసే ప్ర‌క్రియ జ‌రిగింద‌ని పేర్కొంది. 8 నిఘా విమానాల కోసం బోయింగ్ సంస్థ రూ.8,700 కోట్లు బిడ్డింగ్ వేయగా - యూరప్ కు చెందిన ఈఏడీఎస్ సంస్థ కేవలం రూ.7,776 కోట్లకే ఎనిమిది ఏ-139 విమానాలను సరఫరా చేస్తామని ముందుకు వచ్చిందని వెల్లడించింది. రాబోయే 20 ఏళ్లకు ఈ విమానాలకు అందించాల్సిన సర్వీసింగ్ ఖర్చుల్ని ఈఏడీఎస్ బిడ్డింగ్ కు కలిపేసిన రక్షణ శాఖ.. బోయింగ్‌కు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చిందని ఆక్షేపించింది. తద్వారా ఈఏడీఎస్ బిడ్డింగ్ ఖర్చు రూ.8,712 కోట్లకు చేరుకుంది. దీంతో బోయింగ్ ఈ కాంట్రాక్టును దక్కించుకుందని కాగ్ పేర్కొంది.

దీంతోపాటుగా మ‌రో అవినీతి కూడా జ‌రిగింద‌ని కాగ్ తెలిపింది. ఈ విమానాల స‌ర్వీసింగ్‌కు మూడేళ్ల పాటు ప్ర‌త్యేక ఒప్పందం కుదుర్చుకుంది. మ‌రో ఒప్పందంలో కూడా బోయింగ్ ప‌ట్ల‌నే కేంద్రం అనుకూలంగా వ్య‌వ‌హ‌రించింద‌ని కాగ్ తెలిపింది. 2013-15లో నాలుగు లాంగ్ రేంజ్ పీ-8ఐ నిఘా విమానాల కొనుగోలుకు భారత నేవీ బోయింగ్ తో ఒప్పందం కుదుర్చుకుందని కాగ్ వివ‌రించింది. ఈ ఒప్పందాల ప్ర‌క్రియ‌లో నిబంధ‌నలు పాటించిన తీరుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయ‌ని తెలిపింది.