Begin typing your search above and press return to search.

మోడీ రాజ్యంలోనూ కాలం చెల్లిన మందుగుండేనట!

By:  Tupaki Desk   |   8 Dec 2019 4:32 AM GMT
మోడీ రాజ్యంలోనూ కాలం చెల్లిన మందుగుండేనట!
X
కేంద్రంలో మోడీ మాష్టారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఐదేళ్లు విజయవంతంగా బండి నడిపి.. రెండోసారి కూడా ప్రజాతీర్పును ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వేళ.. పాలనలోనూ.. రాజకీయాల్లోనూ తనకు తిరుగులేదన్నట్లుగా మాటలు చెబుతుంటారు. సైన్యం కష్టం గురించి.. దేశ రక్షణ కోసం వారు పడే తపన గురించి మోడీ లాంటి మేనేజ్ మెంట్ గురు ఎన్నేసి మాటలు చెబుతారో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మరి.. అలాంటి ఆయన హయాంలో ప్రభుత్వ ఆయుధ కర్మాగారాల్లో మన దరిద్రం గురించి తెలిస్తే షాక్ తినక మానరు.

గతానికి భిన్నంగా దాయాది దేశం తోక జాడిస్తే.. అంతవరకూ కట్ చేసి పారేస్తామన్న సంకేతాల్ని ఇప్పటికే పలుమార్లు ఇచ్చిన మోడీ సర్కారు.. భద్రత పరంగా.. రక్షణపరంగా తీసుకునే చర్యలు తిరుగులేవన్న భావనను కలిగిస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ వాదనే వాస్తవమైతే ఎలాంటి ఇబ్బంది లేదు.కానీ.. తాజాగా కాగ్ ఎత్తి చూపిన లోపాల్ని చూసినంతనే విస్మయానికి గురి కావటమే కాదు.. మోడీ ప్రధానిగా ఉన్న వేళ కూడా ఇలాంటి దరిద్రం ఏమిటన్న ఆవేదన కలుగక మానదు.

ప్రభుత్వంలో చోటు చేసుకునే తప్పుల్ని ఎత్తి చూపిస్తూ.. కడిగిపారేసే కంప్రోల్టర్ ఆడిట్ జనరల్ పొట్టిగా కాగ్ రిపోర్టుకు ఉండే విలువ అంతా ఇంతా కాదు. తాజాగా ప్రభుత్వ రంగంలో నడిచే ఆయుధ కర్మాగారాల నిర్వహణలో మనోళ్లు వ్యవహరించే తీరు తెలిస్తే అవాక్కు కావటమే కాదు.. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో మనం ఉన్నామా? అని ఆందోళన చెందక తప్పదు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల క్రితమే కాలం చెల్లినట్లుగా తేల్చేసిన మందుగుండు సామాగ్రిని నేటికి వినియోగిస్తున్న వైనాన్ని కాగ్ తన నివేదికలో ప్రస్తావించింది. భారత సైన్యం చేతిలో ఉన్న ఆయుధాలు.. మందుగుండు కాలం చెల్లినవా? అన్న సందేహానికి గురి చేసేలా తాజా వైనం ఉండటం గమనార్హం.

టి 72.. టీ 90 ట్యాంకులు.. సాయుధ శకటాలు.. విమాన విధ్వంసక తుపాకులు.. మోర్టార్లు.. రాకెట్ లాంచర్లలో వాడే మందుగుండు నాణ్యతపైనా.. వాటి అప్ గ్రేడ్ చేసే విషయంపై కొత్త సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి. ఎందుకంటే మందుగుండును పేల్చటానికి ఉండే ప్యూజులు చాలా కీలకం. గతంలో వీటిని మెకానికల్ ప్యూజులు వినియోగించేవారు. పాతికేళ్ల క్రితమే వచ్చిన ఎలక్ట్రానిక్ ఫ్యూజులు మెకానిక్ ప్యూజులు కన్నా విశ్వసనీయమే కాదు.. చాలా కచ్ఛితత్వంతో పని చేస్తాయి. వాటి బరువు కూడా తక్కువే. అయినప్పటికీ వాటిని వాడకపోవటం కావటం విశేషం.

అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకోవాల్సింది పోయి.. కాలం చెల్లిన మెకానిక్ ప్యూజుల్ని వినియోగిస్తున్న తీరుపై కాగ్ ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఎందుకిలా అంటే.. మన అవసరాలకు సరిపడా ఎలక్ట్రికల్ ఫ్యూజుల కొరత ఉందన్న సిత్రమైన వాదనను కాగ్ వద్దకు తీసుకొచ్చింది ప్రభుత్వం. సిల్లీ కాకపోతే.. ఎప్పుడో పాతికేళ్ల క్రితమే వచ్చేసిన ఎలక్ట్రికల్ ఫ్యూజులకు బదులుగా నాట్ నాట్ సెంచురీ నాటి మెకానికల్ ఫ్యూజులు వాడటం వెనుక అసలు మర్మం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దేశ భద్రత విషయంలోనూ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారన్న విషయాన్ని కాగ్ చెప్పే వరకూ మోడీ సర్కారు ఏం చేస్తున్నట్లు? మొనగాడని తరచూ కీర్తించే వారంతా ఇలాంటి వైనాలపై ఏమని బదులిస్తారు?