Begin typing your search above and press return to search.

స్మృతికి డిమోష‌న్‌.. ఇక మిగిలింది ఒక్క‌టే!

By:  Tupaki Desk   |   15 May 2018 4:41 AM GMT
స్మృతికి డిమోష‌న్‌.. ఇక మిగిలింది ఒక్క‌టే!
X
అత్యున్న‌త స్థానానికి చేరుకోవ‌టం అంత ఈజీ కాదు. కానీ.. అనుకోని రీతిలో అదృష్టం త‌న్నుకొచ్చిన వేళ‌.. దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్య‌త ఉంటుంది. అయితే.. కొంద‌రు ప్ర‌ముఖులు ఇలాంటి సంద‌ర్భాన్ని అవ‌గాహ‌న లేమి.. మితిమీరిన ఆత్మ‌విశ్వాసంతో మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న విష‌యం మ‌రోసారి రుజువైంది.

ఎంపీగా 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేని బుల్లితెర న‌టి.. సెల‌బ్రిటీ హోదాతో వెలిగిపోయే స్మృతి ఇరానీకి ఏకంగా కేంద్ర మాన‌వ‌వ‌న‌రుల శాఖ‌ను అప్ప‌గించారు. అంత కీల‌క‌మైన శాఖ‌ను ఎంపీగా గెల‌వ‌ని స్మృతికి మోడీ మాష్టారు అప్ప‌గించ‌టంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డిచింది. మొద‌ట్లో త్రోటు పాటు లేకుండా న‌డిచిన స్మృతి త‌ర్వాత చేసిన త‌ప్పుల‌తో ఆమె ఆ శాఖ నుంచి త‌ప్పిస్తూ గ‌తంలో మోడీ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ మ‌ధ్య‌న జ‌రిపిన కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణలో భాగంగా మాన‌వ‌వ‌న‌రుల శాఖ నుంచి స్మృతిని తొల‌గించారు. ఆ సంద‌ర్భంగా స‌మాచార ప్ర‌సార శాఖ ప‌ద‌విని ఆమెకు క‌ట్ట‌బెట్టారు. దీంతో పాటు టెక్స్ టైల్స్ శాఖ‌ను ఇచ్చారు.

తాజాగా.. ఆమెకున్న ఐ అండ్ బీ మంత్రిత్వ శాఖ నుంచి స్మృతిని త‌ప్పిస్తూ మోడీ సంచ‌లన నిర్ణ‌యం తీసుకున్నారు. ఆమె స్థానాన్ని ఇప్ప‌టికే అదే శాఖ‌లో స‌హాయ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న రాజ్య‌వ‌ర్ధ‌న్ సింగ్ రాథోడ్‌కు ఈ శాఖ‌ను అప్ప‌గిస్తూ మోడీ నిర్ణ‌యం తీసుకున్నారు. ఊహించ‌నిరీతిలో సోమ‌వారం రాత్రి కేంద్ర మంత్రి వ‌ర్గాన్ని పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రిస్తూ ప‌లు నిర్ణ‌యాల్ని వెల్ల‌డించారు. తాజాగా చేసిన మార్పుల్లో స్మృతి ఇరానీపై భారీ దెబ్బ ప‌డిన‌ట్లేన‌ని చెప్పాలి.

ఇప్పుడామె చేతిలో ఎందుకు ప‌నికి రాని.. ప్రాధాన్య‌త లేని టెక్స్ టైల్స్ శాఖ‌ను మాత్రం మిగిలింది.

దీనికి కార‌ణం స్మృతి స్వ‌యంకృతాప‌రాధ‌మేన‌ని ఎబుతున్నారు. న‌కిలీ వార్త‌లు రాసే జ‌ర్న‌లిస్టుల‌పై కేసులు న‌మోదు చేసి శిక్షించాల‌నే నిబంధ‌న‌ను ఆమె జారీ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో.. స్మృతి ఇరుకున ప‌డ్డారు. ఆమెపై బోలెడంత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌ధాని మోడీ ఎంట‌రై.. స్మృతి జారీ చేసిన ఉత్త‌ర్వును వెన‌క్కి తీసుకున్నారు. ఆ సంద‌ర్భంగానే ఆమెపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని.. మోడీ తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లుగా స‌మాచారం.

తాజాగా చేసిన మరిన్ని మార్పుల్లోకి వెళితే.. రైల్వే మంత్రి పీయూష్ గోయిల్ కు తాత్కాలికంగా ఆర్థిక‌.. కార్పొరేట్ వ్య‌వ‌హారాల శాఖ‌ను క‌ట్ట‌బెట్టారు. ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీకి కిడ్నీ మార్పిడి శ‌స్త్ర‌చికిత్స జ‌రిగిన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు చెబుతున్నారు జైట్లీ ఆరోగ్యం కుద‌ట‌ప‌డి.. ఆయ‌న విధుల‌కు హాజ‌ర‌య్యేవ‌ర‌కూ ఆయ‌నే కొన‌సాగ‌నున్నారు. ఇక‌.. ఎస్ ఎస్ అహ్లువాలియాకు తాగునీరు.. పారిశుద్ధ్య శాఖ స‌హాయ‌మంత్రి స్థానం నుంచి ముఖ్య‌మైన ఎల‌క్ట్రానిక్స్.. అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ‌ను అప్ప‌గించారు. ఇక‌.. ఈ శాఖ‌లో స‌హాయ‌మంత్రిగా ఉన్న అల్ఫోన్స్ క‌న్న‌థానం ప‌ర్యాట‌క శాఖ స‌హాయ‌మంత్రిగా మాత్ర‌మే కొన‌సాగ‌నున్నారు. తాజాగా మార్పుల‌తో త‌ప్పు చేసిన వారు స‌న్నిహితులైనా వారిపై వేటు త‌ప్ప‌ద‌న్న విష‌యాన్ని తేల్చి చెప్పిన‌ట్లైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.