Begin typing your search above and press return to search.

కర్ణాటక సర్కార్‌ లో అప్పుడే ముసలం..కారణం ఇదే!

By:  Tupaki Desk   |   24 Dec 2019 9:52 AM GMT
కర్ణాటక సర్కార్‌ లో అప్పుడే ముసలం..కారణం ఇదే!
X
కర్ణాటక రాజకీయాల లో ఎప్పుడు ఎదో ఒక తంతు జరుగుతూనే ఉంటుంది. ఒకటి పోయే లోపు ఇంకొకటి ఆ రాష్ట్ర రాజకీయాల లో హాట్ టాపిక్ గా మారుతుంటుంది. గత కొన్ని రోజుల ముందు వరకు ఎమ్మెల్యేల వివాదం రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యవహారం ఒక కొలిక్కి రాగానే ..మళ్లీ ఉపఎన్నికలు అంటూ ప్రచారం లో ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ సమయంలో బయట పడ్డ కొన్ని వీడియోలు దేశ రాజకీయాల లో సైతం హాట్ టాపిక్ గా మారాయి.

ఇక ప్రస్తుతం అంతా సజావుగా సాగుతుంది అన్న సమయం లో మరోసారి కర్ణాటక రాజకీయం లో ముసలం ఏర్పడింది. ఈసారి బీజేపీ పార్టీలో ముసలం ఏర్పడింది అని చెప్పాలి. సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుపుతామని సీఎం యడియూరప్ప ప్రకటించారు. ఆ ప్రక్రియకు ఇంకా ఇరవై రోజుల సమయం ఉంది. కానీ , ఇప్పటినుండే పార్టీ నేతలలో ముసలం మొదలైంది అని తెలుస్తుంది. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ బీజేపీ ఎమ్మెల్యే గూళిహట్టి శేఖర్‌ సీనియర్‌ నేతల పై ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఎమ్మెల్యే ల ప్రమాణస్వీకారం తర్వాత వారందరికీ మంత్రి పదవులు ఇస్తామనడంపైనా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

హొసదుర్గ లోని బనశంకరి భవన్‌ లో గూళిహట్టి అభిమానుల సంఘం ప్రత్యేక సమావేశం జరిగింది. ఒకవేళ వచ్చే మంత్రి వర్గ విస్తరణలో మంత్రిగా అవకాశం ఇవ్వకపోతే భవిష్యత్తు లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే అంశం పైనే అభిమానులు చర్చించారు. 2008లో సీఎం యడియూరప్ప నేతృత్వం లో అప్పటి స్వతంత్ర ఎమ్మెల్యే గూళిహట్టి శేఖర్‌ బీజేపీ లో చేరారు. బీజేపీ నుంచి గెలిస్తే మంత్రిని చేస్తామని అప్పట్లోనే హామీ ఇచ్చారు. ప్రస్తుతం అనర్హులు ప్రజాతీర్పు తో అర్హులై శాసన సభలో చేరి మంత్రులైతే మేమేం చేయాలంటూ గూళి హట్టి విచారం వ్యక్తం చేస్తున్నారు. అర్హుల జాబితాలో ఒకరిగా భావించి కేబినెట్‌లో తనకి అవకాశం ఇవ్వాలని సీఎం ని కోరారు. గూళిహట్టి డిమాండ్‌ తో పార్టీలో అప్పుడే మంత్రి పదవుల పై చర్చ మొదలైంది.