Begin typing your search above and press return to search.

ఆ విషయంలోనూ మడమ తిప్పేస్తారా... ?

By:  Tupaki Desk   |   30 Nov 2021 11:30 PM GMT
ఆ విషయంలోనూ మడమ తిప్పేస్తారా... ?
X
మాట తప్పను మడమ తిప్పను ఇది జగన్ నినాదం. ఇది బాగా పాపులర్ కూడా అయింది. నిజానికి రాజకీయాల్లో ఇవి ఏ మాత్రం అక్కరకు రాని స్లోగన్స్ గా చెప్పాలి. కన్యాశుల్కం లో గిరీశం చెప్పినట్లుగా ఎప్పటికపుడు అభిప్రాయాలు మార్చుకోకపోతే పొలిటీషియనే కాదు, ఇక పరిస్థితులు ఎపుడూ ఒక్కలా ఉండవు. మరి మాట తప్పను మడమ తిప్పను అంటే ఎలా. ఇదే ఇపుడు జగన్ కూడా నేర్చుకున్న పాఠం. అధికారంలోకి వచ్చాక ఆయన చదివిన పాఠంగా కూడా అనుకోవాలి. అందుకే ఆయన వరసబెట్టి అనేక నిర్ణయాలలో ఏ మాత్రం జంకూ లేకుండా మడమ తిప్పేస్తున్నారు. ఈ మధ్యనే శాసన మండలి రద్దు వద్దు అనుకున్నారు. మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు.

ఇపుడు ఆయన గంభీరంగా పార్టీ జనాలకు ఇచ్చిన మరో హామీని విషయంలో కూడా మడమ తిప్పేయడానికి రెడీ అయిపోతున్నారు అని టాక్. ఇంతకీ ఆ ఘనమైన హామీ ఏంటీ అంటే వైసిపీ సర్కార్ సగం పాలన ముగిసేసరికి నూటికి తొంబై శాతం మంది మంత్రులను తీసి పక్కన పెట్టేస్తాను. వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటాను అని. ఇది ఎన్నికలలో గెలిచిన వేళ, ఉత్సాహపూర్తమైన వాతావరణంలో చెప్పిన మాట. అయితే నాటికీ నేటికీ పరిస్థితి చాలా మారిపోయింది.

అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లలో వైసీపీ గ్రాఫ్ కూడా బాగా తగ్గిందని ప్రచారం ఉంది. దాంతో పాటు ఇపుడు మంత్రులను మొత్తం తీసేస్తే అది రాజకీయంగా తీవ్రమైన ఫలితాన్ని ఇస్తుందని అంచనాలు ఏవో ఉన్నట్లుగా ఉంది. ఇక మరో వైపు చూసుకుంటే జగన్ మంత్రులను ఎందుకు తీసేయాలీ అన్న చర్చ కూడా ఉంది. మంత్రులు బాగానే పనిచేస్తున్నారు. కొందరు తప్ప ఎక్కువ మంది తమకు అప్పగించిన బాధ్యతలు కూడా చక్కగానే చూస్తున్నారు. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో చూసుకుంటే మంత్రులు తమ పనితీరుని గట్టిగానే చూపించారు.

ఈ నేపధ్యం ఇలా ఉంటే కరోనా వంటి విపత్తులు వచ్చి రెండేళ్ళుగా ఎక్కడికీ తిరగలేకపోయామన్న బాధ చాలా మంది మంత్రులలో ఉంది. దాంతో వారి వైపు నుంచి తన వైపు నుంచి అన్నీ ఆలోచించుకున్న తరువాతనే జగన్ మంత్రి వర్గ విస్తరణ విషయంలో ఆచీ తూచీ వ్యవహరిస్తారు అంటున్నారు. సీనియర్ మంత్రులను, పని మంతులను కొనసాగిస్తూనే కొందరిని మాత్రం పక్కన పెడతారు అని తెలుస్తోంది. ఆ కొందరి ప్లేస్ లోనే కొత్త వారు వచ్చే అవకాశం ఉందిట. అది కూడా ఇపుడు కాదు, మరో ఆరు నెలల తరువాత. అంటే ఈ మంత్రులు మూడేళ్ళ కాలం పూర్తి చేసిన తరువాత అన్న మాట. మొత్తానికి ఊరించి ఊరించి మంత్రి వర్గ విస్తరణను కొద్ది పాటి మార్పులు చేర్పులతోనే జగన్ ముగించనున్నారు అంటున్నారు. అదే నిజమైతే జగన్ మడమ తిప్పేసినట్లే అనుకోవాలేమో.