Begin typing your search above and press return to search.

శిఖండి రాజకీయాలు చేస్తారా: భైరెడ్డి ఫైర్

By:  Tupaki Desk   |   13 Nov 2020 8:20 PM IST
శిఖండి రాజకీయాలు చేస్తారా: భైరెడ్డి ఫైర్
X
వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. నందికొట్కూరు వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సభలో ఈ గందరగోళం చెలరేగింది.. జెండా మోసిన వారికి న్యాయం జరగలేదని పలువురు నినదించారు.

నందికొట్కూరులో వైసీపీ నాయకుల మధ్య విభేదాలు ఇలా భగ్గుమన్నాయి. తొలి నుంచి నందికొట్కూర్ ఎమ్మెల్యే అర్థర్, పార్టీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గాలకు ఇక్కడ పడడం లేదు. ఇటీవలే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంపిక విషయంలో రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అన్నాయి. జిల్లా ఇన్ చార్జి మంత్రిపైనే అర్థర్ వర్గం నిప్పులు చెరిగింది.

తాజాగా వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర పూర్తయ్యి మూడేళ్లు గడిచిన సందర్భంగా నందికొట్కూరు పట్టణంలో ర్యాలీ, పటేల్ సెంటర్ లో సభ నిర్వహించారు. బైరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ సభలో సిద్ధార్త రెడ్డి తన ప్రత్యర్థి వర్గంపై విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో వైసీపీ జెండా మోసిన వారికి న్యాయం జరగలేదని మండిపడ్డారు.

ఈ సందర్భంగా బైరెడ్డి వైసీపీలోని రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోకి మధ్యలో వచ్చిన వారికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. నమ్ముకున్న అసలైన వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు శిఖండి రాజకీయం చేస్తున్నారని ఎదురుదాడి చేశారు. జిల్లాలో పెద్ద నాయకులం అనుకునే వాళ్లు వారి పంథా, పద్ధతి మార్చుకోవాలని స్పష్టం చేశారు. నందికొట్కూరులో వేలుపెట్టి రాక్షసానందం పొందుతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బైరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ చర్చనీయాంశంగా మారాయి.