Begin typing your search above and press return to search.

బాబుకు అమరావతి దెయ్యం పట్టిందా?

By:  Tupaki Desk   |   22 Feb 2016 6:52 AM GMT
బాబుకు అమరావతి దెయ్యం పట్టిందా?
X
రాజకీయాల్లో కొన్ని అంశాలు చాలా చిత్రంగా ఉంటాయి. ఒకప్పుడు చంద్రబాబుకు ఎవరైతే అండగా ఉండి.. పార్టీ కోసం తమ ప్రాణాలు అయినా ఇచ్చేస్తామని ప్రకటించారో.. అలాంటి వారిలో కొందరు బాబు మీద చేసే వ్యాఖ్యలు.. విమర్శలు చూస్తే ఆసక్తికరంగా ఉంటాయి. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించి.. బాబుకు చాలా క్లోజ్ అయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తర్వాతి కాలంలో పార్టీ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. జై రాయలసీమ నినాదంతో గత కొద్దికాలంగా తన వాదనను వినిపిస్తున్నారు.

అయితే.. ఆ మధ్యన ఆయనపై హత్య కేసు నమోదు కావడం .. అండర్ గ్రౌండ్ కి వెళ్లటంతో ఆయన వాయిస్ పెద్దగా వినిపించలేదు. ఇప్పుడిప్పుడే ఆయన మళ్లీ తన గళం విప్పుతున్నారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్న ఆయన.. జై రాయలసీమ అంటూ నినదిస్తూ ఉద్యమించటానికి సిద్ధమయ్యారు. తాజాగా కర్నూలు జిల్లాలో బస్సు యాత్ర షురూ చేసి ఆయన.. బాబు మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

జై తెలంగాణ అంటూ తెలంగాణ వాసులు తమ రాష్ట్రాన్నిసాధించారని.. అదే తీరులో జై రాయలసీమ అన్న నినాదంతో సీమ ప్రజలు ముందుకు వెళ్లాలంటున్న బైరెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి దెయ్యం పట్టుకుందని వ్యాఖ్యానించారు. సీమ వాసులంతా కలిసి దెయ్యం వదిలిద్దామన్నారు. పవర్ లోకి వచ్చి రెండేళ్లు అయినా.. రాయలసీమకు ఆయన చేసిందేమీ లేదన్న బైరెడ్డి.. ఉపాధి లేక సీమ వాసులు పెద్ద ఎత్తున వలసలు వెళుతున్నారని వ్యాఖ్యానించారు.

రానున్న రోజుల్లో సీమ ప్రజల పౌరుషం ఏమిటో చూపిస్తామంటూ హెచ్చరిస్తున్న ఆయన... కోస్తాలోని 123 సీట్ల కోసం సీమను నిర్లక్ష్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీమ సంపదను తీసుకెళ్లి అక్కడ ఖర్చు చేస్తున్నట్లుగా ఆరోపించారు. ఒక విభజనతో కిందామీదా పడుతున్న సీమాంధ్రకు మరో విభజన స్వరం అవసరమా? అన్నది ఒక ప్రశ్న అయితే.. సీమ వాసుల విషయంలో చంద్రబాబు మరింత దృష్టి పెట్టటం ద్వారా.. ఇలాంటి అసంతృప్తి గొంతులకు అభివృద్ధితో సమాధానం చెప్పాలని కోరుతున్నారు.