Begin typing your search above and press return to search.

తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక ఖాయమేనా?

By:  Tupaki Desk   |   17 Sept 2020 11:15 AM IST
తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక ఖాయమేనా?
X
కరోనాతో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించిన తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ మరణం రాజకీయవర్గాల్లో విషాదాన్ని నింపింది. కరోనా ధాటికి ఆర్థికంగా ఉన్నవారు.. లేనివారు.. ఎంత పెద్ద వ్యక్తులు అయినా సరే తట్టుకొని నిలబడ లేక పోతున్నారు. తమిళనాట ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే కరోనా తో చని పోయారు. మంత్రులు కూడా తప్పించు కోవడం లేదు. తాజాగా తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ ను కూడా కరోనా బలితీసుకుంది.

అయితే కరోనా నెగెటివ్ వచ్చాకే తిరుపతి ఎంపీకి గుండెపోటు వచ్చిందని.. ఆ కారణంగా చనిపోయారని అంటున్నారు. కరోనా నుంచి కోలుకున్నట్లుగా చెబుతున్నారు. కానీ కరోనా తెచ్చిన మానసిక ఒత్తిడితోనే గుండెపోటుకు గురై మరణించినట్టుగా అర్థమవుతోంది.

అయితే సిట్టింగ్ తిరుపతి ఎంపీ మరణంతో ఇప్పుడు తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. వచ్చే ఆరునెలల వ్యవధిలోనే ఈ సీటుకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

సాధారణంగా ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తారు. ప్రతిపక్షాలు పోటీచేయకుండా వదిలేస్తాయి. కానీ ఏపీలో సెగలు కక్కుతున్న రాజకీయం సాగుతుండడంతో పోటీ అనివార్యంగా కనిపిస్తోంది.

గత లోక్ సభ ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా వైసీపీ తరుఫున నిలబడ్డ దుర్గా ప్రసాద్ రావు ఏకంగా 2.20 లక్షల మెజార్టీతో టీడీపీ అభ్యర్థిపై ఘనవిజయం సాధించారు.

కాగా గత చంద్రబాబు హయాంలో తిరుపతి అసెంబ్లీకి కూడా ఉప ఎన్నిక వచ్చింది. వైసీపీ సానుభూతితో దూరంగా ఉండగా.. కాంగ్రెస్, టీడీపీలు పోటీచేశాయి. టీడీపీ గెలిచింది. ఈసారి టీడీపీ వైదొలుగుతుందా లేదా చూడాలి.