Begin typing your search above and press return to search.

బాబు, య‌న‌మ‌ల‌ను ఏకేసిన పెద్దాయ‌న‌

By:  Tupaki Desk   |   18 Dec 2016 7:50 AM GMT
బాబు, య‌న‌మ‌ల‌ను ఏకేసిన పెద్దాయ‌న‌
X
సుదీర్ఘ‌కాలం త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చిన సీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు - రాష్ట్ర ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తీరుపై నిప్పులు చెరిగారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటలో నిర్వహించిన దివీస్‌ వ్యతిరేక పోరాట బహిరంగ సభలో రాఘ‌వులు ప్రసంగించారు. 'ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే దివీస్‌ కంపెనీని బంగాళాఖాతంలో కలిపేద్దాం - తన్ని తరిమేద్దాం' అని పిలుపునిచ్చారు. ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలకు ముప్పుతెస్తున్న దివీస్‌ కంపెనీని బ్లాక్‌ లిస్ట్‌ లో పెట్టాలని, ఈ కంపెనీ మందులపై అమెరికా సైతం ఆగ్రహంగా ఉందని రాఘవులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు - ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బీసీల‌ జపం చేస్తూ.. ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని రాఘవులు సూటిగా ప్రశ్నించారు. వారిద్దరూ దివీస్‌ కంపెనీకి ఊడిగం చేస్తూ, ఆ కంపెనీ మోచేతి నీళ్లు తాగుతున్నారని మండిప‌డ్డారు.

గ‌తంలో సోంపేట థర్మల్‌ విద్యుత్‌ వ్యతిరేక పోరాటంలో ముగ్గురిని ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని, అయిన‌ప్ప‌టికీ అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని ఎదిరించి 500 రోజులు పోరాడి విజయం సాధించారని రాఘవులు గుర్తుచేశారు. సోంపేట ప్రజల ధైర్యాన్ని గుర్తు చేసుకుని తొండంగి మండలంలోని ప్రజలు దివీస్‌ కు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడితే ప్రభుత్వం పారిపోతుందనీ స్పష్టం చేశారు. తమ కంపెనీ కోసం పనిచేస్తున్నందుకు దివీస్ యాజ‌మాన్యం ఈ ప్రాంతంలో యనమల సోదరులకు గెస్ట్‌ హౌస్‌ కట్టించిందని, ఇక్కడి ప్రజలకు అలా గెస్ట్‌ హౌస్‌ లు కట్టి ఇవ్వగలదా? అని రాఘ‌వులు నిలదీశారు. ఓటు కోసం కులం జపం చేస్తున్న యనమల సోదరులు నోటు కోసం దివీస్‌ జపం చేస్తున్నారని విమర్శించారు. వందల ఎకరాలున్న భూస్వామిని విడిచిపెట్టి పేదల భూములు లాక్కోవడమేమిటి? ఆ భూముల్లోని చెట్లను నరికే అధికారం ఎవరిచ్చారు? అని రాఘవులు ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌ రైతుల భూములను కాపాడాల్సింది పోయి తన దత్తత గ్రామం సహా భూములను దివీస్‌ కంపెనీకి అప్పజెప్పడం దారుణమన్నారు.

కాగా త‌మ ప‌ర్య‌ట‌న‌పై విప‌రీతమైన పోలీస్ ఆంక్ష‌లు విధించ‌డంపై బీవీ రాఘ‌వులు మండిప‌డ్డారు. 'మేమేమైనా దొంగతనానికి వచ్చామా? దోపిడీకి వచ్చామా? ఇక్కడికి పోలీసులు ఎందుకు రావాల్సి వచ్చింది? రైతుల భూములు, చెట్లు దొంగిలించిన దొంగలను పట్టుకోవడం మానేసి దివీస్‌ కు సేవచేస్తారా?' అని రాఘ‌వులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భూముల్లోకి వెళ్లకుండా తమ కార్యకలాపాలకు అడ్డుపడుతున్న వారిపై బాధితులు పోలీస్‌ స్టేషన్లలో కేసులు పెట్టాలని అన్నారు. డీఐజీ నుంచి ఎస్‌ ఐ స్థాయి వరకూ పోలీసులు.. అధికార పార్టీ నాయకులకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. కాగా రాఘ‌వులు ప్ర‌సంగం సంద‌ర్భంగా 'దివీస్‌ మాకొద్దు' అంటూ నినాదాలతో హోరెత్తించారు. పురుషుల కంటే మహిళలు ధైర్యంగా ఉన్నారని, ఈ పోరాటంలో ముందున్నారని, భవిష్యత్తులో కూడా మహిళలు ముందుండాలని రాఘవులు కోరినప్పుడు మహిళల్లో మంచి స్పందన కనిపించింది. చంద్రబాబు, మంత్రి యనమల బీసీ జపం చేస్తూ...బీసీలు నాశనమవుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించినప్పుడు బాధితులు చప్పట్లు కొడుతూ స్పందించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/