Begin typing your search above and press return to search.

బాబు, జ‌గ‌న్ ఇరుక్కున్న‌ట్లున్నారే

By:  Tupaki Desk   |   16 Oct 2016 9:49 AM GMT
బాబు, జ‌గ‌న్ ఇరుక్కున్న‌ట్లున్నారే
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు - ఆ రాష్ట్ర ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌ద‌ర్శించిన అత్యుత్సాహం వారికే ఇబ్బందిని తెచ్చిపెట్టేలా క‌నిపిస్తోంది. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు చేసిన డిమాండ్ ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. ప్రభుత్వానికి నల్లధనం అప్పగించ‌డంపై చంద్రబాబు - వైఎస్‌ జగన్‌ దోబూచులాట మాని ఉమ్మడిగా ఉత్తరం రాసి అసలు వ్యక్తుల పేర్లను బహిర్గతం చేయాలని కోరాల్సిందిగా రాఘ‌వులు హితవు పలికారు. 'సమకాలీన రాజకీయాలు -పరిణామాలు' అంశంపై జరిగిన సభలో రాఘ‌వులు ప్రసంగిస్తూ నల్లధనం అప్పగించిన వ్యవహారంలో పేర్లు బయటపెట్టబోమని చట్టంలో ఉన్నందునే జగన్‌-చంద్రబాబు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు.

ప్రభుత్వానికి అప్పగించిన రూ.13 వేల కోట్లలో జగన్‌ కి చెందిన రూ.10 వేల కోట్లు ఉన్నాయని పేర్కొంటూ సీఎం చంద్రబాబు చెబుతున్నారనీ, అయితే చంద్రబాబు బినామీయే రూ.10 వేల కోట్లు అప్పగించారని ఆ డబ్బు చంద్రబాబుదేనని జగన్‌ ప్రధానికి లేఖ రాయడం ద్వారా ఇద్దరూ తోడుదొంగలుగా మారారని రాఘ‌వులు చెప్పారు. అయితే ఎవరికి వారు తమ వద్ద ఉన్న ఆధారాలతో ఉమ్మడిగా ఉత్తరం రాసి అసలు పేర్లు బయటపెట్టాలని ప్రధాన మంత్రిని కోరాలన్నారు. మీరు రాయలేకపోతే మేమే లేఖ రాసి మీ వద్దకు వస్తాం. ఇద్దరూ సంతకాలు పెట్టండి. లేదంటే ఉమ్మడి వేదికపైకి వచ్చి సంతకాలు చేయాలి. రాజకీయాల్లో ఇద్దరూ నిజాయితీ పరులు కాదు.. ఈ విషయం ప్రజలకు తెలుసు. గత ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.వెయ్యేసి ఇచ్చిన చరిత్ర టీడీపీ - వైసీపీకి ఉంది. ఇంత బ్లాక్‌ మనీ మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని రాఘ‌వులు ప్రశ్నించారు.

విదేశీ మోజులో దేశంలోని నిర్మాణ సంస్థలను గాడిదలుగా - సింగపూర్‌ కంపెనీలను గుర్రాలుగా పేర్కొనడాన్ని రాఘ‌వులు తప్పుపట్టారు. అవకాశమిస్తే దేశీయ కంపెనీలు కూడా ఎంతో గొప్పగా నిర్మాణాలు చేయగలవని తెలిపారు. సింగపూర్‌ కంపెనీలపై ప్రేమతో స్వదేశీ సంస్థల సామర్ధ్యాన్ని శంకించడం తగదని హితవు పలికారు. సింగపూర్‌లో దాచుకున్న సొమ్మును తెచ్చుకోడం కోసమే వారికి పెద్దపీట వేస్తున్నారని రాఘ‌వులు విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలు - రాజధాని నిర్మాణం - బందరు పోర్టు పేరుతో 15 లక్షల ఎకరాల భూముల్లో వ్యవసాయాన్ని విచ్చిన్నం చేస్తే అభివృద్ది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. విదేశాల్లో పారిశ్రామిక రంగం అంతా సంక్షోభంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ కు వ‌చ్చి విదేశీ సంస్థలు ఎలా పెట్టుబడులు పెడతాయని ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/