Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల రేటు చెప్పిన రాఘవులు

By:  Tupaki Desk   |   18 April 2016 4:29 AM GMT
ఎమ్మెల్యేల రేటు చెప్పిన రాఘవులు
X
తప్పుల మీద తప్పులు రాజకీయ పార్టీలు చేయకూడదు. కానీ.. అలాంటి తప్పుల్నే చేసి ప్రజాదరణ కోల్పోయారు కమ్యూనిస్టు నేతలు. ఆదర్శాల కోసం దేనినైనా త్యాగం చేస్తారని.. వారికి పదవులు ఏ మాత్రం ముఖ్యం కాదన్న పేరుప్రఖ్యాతులు ఉండేవి. కానీ.. గడిచిన పదేళ్లలో చేయకూడని తప్పులెన్నో చేసిన ఘనత కమ్యూనిస్టులదే. తెలుగు ప్రజలకు అత్యంత కీలకమైన రాష్ట్ర విభజన విషయంలో ద్వంద వైఖరిని అనుసరించి అటు తెలంగాణకు కాకుండా.. ఇటు సీమాంధ్రులకు కాకుండా పోయారు.

అలాంటి కమ్యూనిస్టు పార్టీల్లో ఒకటైన సీపీఎం.. ఏపీలో తన బలాన్ని పెంచుకోవాలన్న ప్రయత్నం చేస్తోంది. సమైక్యవాదానికి తాము మద్దతు ఇస్తామని చెబుతూనే.. విభజన సందర్భంగా ఒక్క నిరసన ప్రదర్శనను నిర్వహించని ట్రాక్ రికార్డు ఎవరిదైనా ఉందంటే అది సీపీఎం నేతలదేనని చెప్పక తప్పదు. సీమాంధ్ర ప్రజల్ని అంతగా మోసం చేసిన సీపీఎం నేతలు.. ఇప్పుడు మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టారు.

ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఏపీలో చంద్రబాబు.. తెలంగాణలో కేసీఆర్ ఓ రేంజ్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో జరుగుతున్న ఆపరేషన్ ఆకర్ష్ గురించి నోరు విప్పటానికి వెనుకాడుతున్న సీపీఎం.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద మాత్రం వీరంగమే వేస్తోంది. చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై తాజాగా గళం విప్పిన సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. జగన్ పార్టీ ఎమ్మెల్యేల్ని కోట్లాది రూపాయిలు పెట్టి చంద్రబాబు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన రాఘవులు మాట్లాడుతూ.. బాబు తీరును తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

ప్రజాస్వామ్యాన్ని అంగడి సరకుగా మార్చేశారని.. సాధారణ ఎన్నికల్లో ఓటరుకు రూ.500 రేటు పలికితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులకు రూ.5 వేల చొప్పున ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేకు రూ.10 కోట్లు రేటు కడుతున్నారని.. ఎంపీలకు గతంలోనే రూ.100 కోట్ల రేటు పలికినట్లుగా రాఘవులు చెప్పుకొచ్చారు. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా... రేట్ల గురించి మాత్రం బాగానే అప్ డేట్ అయినట్లున్నారే. ఇంతకీ ఇంత అప్ డేటెడ్ ఎలా అయినట్లు..?