Begin typing your search above and press return to search.

ప్ర‌త్యేక హోదా ఇందుకే రావ‌డం లేద‌ట‌

By:  Tupaki Desk   |   26 Sep 2015 5:19 PM GMT
ప్ర‌త్యేక హోదా ఇందుకే రావ‌డం లేద‌ట‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టానికి ప్ర‌త్యేక హోదా స్థాయి ఎందుకు ద‌క్క‌డం లేద‌నే విష‌యంలో సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కొత్త వాద‌న వినిపించారు. ఏర‌కంగా చూసినా ఏపీకి ప్ర‌త్యేక హోదా ద‌క్కాల్సి ఉన్న‌ప్ప‌టికీ...కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ‌ల్లే జాప్యం అవుతోంద‌ని మండిప‌డ్డారు. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం - రాష్ర్టంలోని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని విస్మరించాయని ఆయ‌న మండిప‌డ్డారు. రాష్ర్ట ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్రత్యేక హోదా ఇవ్వాల‌ని కేంద్రాన్ని గ‌ట్టిగా అడుగుదామంటే చంద్రబాబే అడ్డుకుంటున్నారని రాఘవులు ఆరోపించారు.

కేంద్రం ఏపీకి న్యాయ‌బ‌ద్దంగా ద‌క్కాల్సిన‌ కేటాయింపులు కాకుండా బిచ్చం వేసిన‌ట్లు నిధులు వేస్తుందని ఆరోపించారు. కేంద్రం వేసే బిచ్చం కోసం చంద్రబాబు పడిగాపులు కాస్తున్నారని రాఘవులు ఎద్దేవాచేశారు. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు భూములను దోచుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ప‌నిలో ప‌నిగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై కూడా మండిప‌డ్డారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలను ఆ రాష్ర్ట‌ మంత్రులు అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ కల్లు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాఘవులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

ఇదే క్ర‌మంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై విరుచుకుపడ్డారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు బూటకపు ఎన్‌ కౌంటర్లు చేస్తున్నాయని ఆరోపించారు. ఎర్ర‌చంద‌నం కూలీల‌ను చంద్ర‌బాబు ఎన్‌కౌంటర్ చేస్తే.... మావోయిస్టుల‌ను కేసీఆర్ చంపించార‌ని మండిప‌డ్డారు. ప్రజాస్వామ్య వాదులు బూటకపు ఎన్‌ కౌంటర్లను ఖండించాలని రాఘవులు పిలుపునిచ్చారు. పార్టీ స‌మావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన రాఘ‌వులు అక్క‌డ కూడా తెలుగు సీఎంల‌పై త‌న ఆగ్ర‌హాన్ని వెళ్ల‌గ‌క్కారు.