Begin typing your search above and press return to search.

టోల్ ద‌గ్గ‌ర ఆగాల్సిన అవ‌సరం లేదు

By:  Tupaki Desk   |   18 Aug 2017 5:06 AM GMT
టోల్ ద‌గ్గ‌ర ఆగాల్సిన అవ‌సరం లేదు
X
హైద‌రాబాద్ నుంచి గుంటూరు కావొచ్చు.. హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు కావొచ్చు.. అంత‌దాకా ఎందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సిటీలోకి రావాలంటే టోల్ ముచ్చ‌ట లేకుండా బ‌య‌ట‌కు రాలేం. ప్ర‌భుత్వ‌.. ప్రైవేటు భాగ‌స్వామ్యం పేరుతో టోల్ తాట తీయ‌టం కొన్నేళ్లుగా అల‌వాటైపోయింది. అయితే.. కాసింత దూరానికి టోల్ గేట్ల‌తో ప్ర‌యాణ‌స‌మ‌యం పెరిగిపోవ‌టం.. ఇక‌.. ర‌ద్దీ వేళ‌ల్లో అయితే.. టోల్ ద‌గ్గ‌రకు వ‌చ్చేసరికి చుక్క‌లు క‌నిపించే ప‌రిస్థితి. ఆగ‌స్టు 15కు కాస్త ముందుగా వ‌చ్చిన లాంగ్‌.. లాంగ్ వీకెండ్ టైంలోనూ టోల్ ద‌గ్గ‌ర భారీగా వాహ‌న స‌ముదాయం ఆగిపోవ‌టం.. భారీ ట్రాఫిక్ జాం చోటు చేసుకుంది. టోల్ గేట్‌ ను దాటి వెళ్లేందుకే గంట‌కు పైగా స‌మ‌యం ప‌ట్టింద‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే.

ఇక‌పై అలాంటి తిప్ప‌ల‌కు కాలం చెల్ల‌నుంద‌ని చెబుతున్నారు. వ‌చ్చే నెల ఒక‌టో తేదీ నుంచి టోల్ గేట్ల ద‌గ్గ‌ర ఆగాల్సిన అవ‌స‌రం లేకుండా వెళ్లిపోవ‌చ్చు. అదెలా అంటే.. ఈ రోజు (శుక్ర‌వారం) నుంచి అందుబాటులోకి రానున్న ఫాస్టాగ్ ల‌తోన‌ని చెబుతున్నారు.

వైఫాస్ట్‌.. ఫాస్టాగ్ పార్ట్న‌ర్ పేరిట రెండు యాప్ ల‌ను జాతీయ ర‌హ‌దారుల ప్రాధికార సంస్థ ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో అవ‌స‌ర‌మైన మొత్తంతో ఫాస్టాగ్‌ ను కొనుగోలు చేసుకునే వీలుంది. అవ‌స‌ర‌మైన మొత్తంతో రీఛార్జ్ చేసుకోవ‌టం ద్వారా టోల్ ప్లాజాల వ‌ద్ద ఆగాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

దేశ‌వ్యాప్తంగా అందుబాటులోకి రానున్న ఈ సాంకేతిక‌త ఎలా ప‌ని చేస్తుందంటే.. ఆన్ లైన్ లో వాహ‌న‌దారుడు త‌న వాహ‌నానికి సంబంధించిన వివ‌రాల్ని న‌మోదు చేసుకుంటాడు. అనంత‌రం వాహ‌న‌దారుడి పేరిట అకౌంట్ ఓపెన్ అవుతుంది. అనంత‌రం నిర్ణీత సొమ్ము చెల్లించిన త‌ర్వాత ఎల‌క్ట్రానిక్ టోల్ ప‌రిక‌రాన్ని వాహ‌నం ముందున్న అద్దానికి అతికిస్తారు. టోల్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న స‌మ‌యానికి అద్దానికి ఉండే ప‌రిక‌రాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేష‌న్ టెక్నాల‌జీ ద్వారా గుర్తిస్తుంది. ఆ వెంట‌నే వాహ‌న‌దారుడి ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఆ వెంట‌నే.. టోల్ గేట్ ద‌గ్గ‌ర వ‌సూలు చేసే మొత్తం ఎంతైతే ఉందో.. ఆ మొత్తం ఖాతాదారుడి ఖాతా నుంచి డిలీట్ అయిపోతుంది. దీంతో.. వాహ‌నదారుడు టోల్ గేట్ ద‌గ్గ‌ర ఆగాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. అంతేకాదు.. వ‌చ్చే నెల ఒక‌టి నుంచి టోల్ గేట్ల వ‌ద్ద ఇలాంటి స‌దుపాయం ఉన్న వారికి సేవ‌లు అందించేందుకు వీలుగా ప్ర‌త్యేక లైన్ ను ఏర్పాటు చేయ‌నున్నారు. మొత్తానికి వాహ‌న‌దారుడి టోల్ క‌ష్టాలు తీర‌నున్నాయ‌న్న మాట‌.