Begin typing your search above and press return to search.

ఆ ఎంపీ కంటతడి కఠిన చట్టంగా మారాలి..

By:  Tupaki Desk   |   21 July 2015 8:54 AM GMT
ఆ ఎంపీ కంటతడి కఠిన చట్టంగా మారాలి..
X
దేశంలో మహిళలపై నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి... అత్యాచారాలకైతే అడ్డుట్టే ఉండడం లేదు. అయితే... ప్రజాప్రతినిధులు మాత్రం వీటిపై పెద్దగా స్పందించడం లేదు... ఉత్తరాది నేతలైతే స్పందించడం లేదు సరికదా దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ, సమాజ్ వాది పార్టీకి చెందిన పలువురు నేతలు అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎంపీ మాత్రం అత్యాచారాలపై మనసున్న మనిషిలా స్పందించారు. అంతేకాదు... అత్యాచార బాధితురాలిని చూసి ఆమె ఏకంగా కంటతడి పెట్టారు. అయితే... కంటతడితో సరిపెట్టకుండా ఒక ఎంపీగా పార్లమెంటులో దీనిపై చర్చ లేవనెత్తి అందరినీ ఆలోచింపజేసి, కూడగట్టి పరిస్థితులు మార్చేందుకు పోరాడితే ఇంకా మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఒక అత్యాచార బాధితురాలిని చూసి కంటతడిపెట్టారు. ఇంతకుముందు కఠినమైన చట్టాలు లేకపోవడం వల్లే బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయిని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాల్లో మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. మంగళవారం ఉదయం అత్యాచార బాధితురాలైన బాలికను ఎంపీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ కంటతడిపెట్టారు. కాగా, బాలికపై అత్యాచారం జరిపిన నిందితుడు ఖాజాను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట బిజెపి కార్యకర్తలు ధర్నా చేశారు. బాధిత బాలికను కర్నూలు ఎస్పీ కూడా పరామర్శించారు. రేప్ నిందితుడిపై దాడికి యత్నం ఉద్రిక్తత కర్నూలు ప్రభుత్వాస్పత్రి వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఏడేళ్ల బాలికపై నిందితుడు ఖాజా అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం కర్నూలు పట్టణంలోని కడగ్‌పూరా కాలనీలో వెలుగుచూసింది. కడగ్‌పూరా కాలనీకి చెందిన ఖాజాబాషా భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి తన ఇంటి పక్కనే ఉన్న ఏడేళ్ల పాపను ఎత్తుకెళ్లాడు. పాప ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నిందితుడు శనివారం రాత్రి పాపపై అత్యాచారం చేసి ఆదివారం వదిలేయడంతో ఇంటికి చేరింది. తల్లిదండ్రులు జరిగిన విషయంపై ఆరా తీసి బాషాను పట్టుకొని చితకబాదారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని ఆస్పత్రిలో చేర్పించారు. బాధిత బాలికను పరామర్శించిన ఎంపీ చట్టాల్లో మార్పులు తెచ్చి మరింత కఠినతరం చేసేలా ప్రయత్నిస్తానని చెప్పారు.