Begin typing your search above and press return to search.

రాజకీయంగా ఒక్క తప్పటడుగు - కనుమరుగైన బుట్టా రేణుక!

By:  Tupaki Desk   |   10 Aug 2020 7:00 PM IST
రాజకీయంగా ఒక్క తప్పటడుగు - కనుమరుగైన బుట్టా రేణుక!
X
రాజకీయాల్లో ఒక్క పొరపాటు చేసినా అది సదరు రాజకీయ నేత భవిష్యత్తును పాతాళానికి తీసుకు వెళ్లవచ్చు. అదే ఒక్క అడుగు అత్యున్నత స్థానానికి కూడా తీసుకు వెళ్తుంది. గత ఎన్నికలకు ముందు కర్నూలు జిల్లాకు చెందిన బుట్టా రేణుక పేరు ఏపీ రాజకీయాల్లో బాగా వినిపించింది. ఎన్నికల తర్వాత ఆమె కనుమరుగయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున కర్నూలు లోకసభ స్థానం నుండి గెలిచారు. రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేనప్పటికీ నాడు జగన్ ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. ఆమె స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు.

వైసీపీ నుండి గెలిచిన బుట్టా రేణుక ఆ తర్వాత నాడు అధికారంలో ఉన్న టీడీపీ పంచన చేరారు. మరో ఎంపీ ఎస్పీవై రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరుతామని ప్రకటన చేశారు. వారు టీడీపీలో చేరకుండా టెక్నికల్‌గా వైసీపీ అడ్డుకున్నప్పటికీ నాటి అధికార పార్టీతోనే ఉన్నారు. వైసీపీ కార్యకలాపాల్లో పెద్దగా పాల్గొనలేదు. ఆ పార్టీ ముఖ్య కార్యక్రమాలకు దూరం పాటించారు. మూడేళ్ల తర్వాత 2017లో పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.

టీడీపీ ఆమెను కేవలం ఫుట్ రెస్ట్‌లాగ మాత్రమే ఉపయోగించుకున్నదనే విమర్శలు ఉన్నాయి. ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంతేకాదు, 2019 ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ కూడా నిరాకరించింది. దీంతో ఆమె తిరిగి వైసీపీ వైపు వచ్చింది. ఆమె వైసీపీలో చేరినప్పటికీ టిక్కెట్ మాత్రం దక్కలేదు. ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోని యాక్టివ్‌గా లేరు. అధికార వైసీపీ వైపు ఉన్నప్పటికీ ఆమె పాత్ర నామమాత్రమే. అలా అని, ఇప్పుడు టీడీపీకి లేదా బీజేపీ వైపు వెళ్లలేని పరిస్థితి. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి, ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక రాజకీయంగా వేసిన ఓ తప్పటడుగు భవిష్యత్తుపై ఊహించని దెబ్బ వేసింది.