Begin typing your search above and press return to search.

టీడీపీ: ఇక్కడ నినాదాలు అక్కడ మౌన భజనలు

By:  Tupaki Desk   |   31 July 2017 4:19 PM GMT
టీడీపీ: ఇక్కడ నినాదాలు అక్కడ మౌన భజనలు
X
రాజకీయాల్లో ద్వంద్వ ప్రమాణాలు అనుసరించడం, రెండు నాల్కల ధోరణితో మాట్లాడడం అనేది ఇవాళ కొత్త సంగతి కాదు. కానీ.. ఏదో రాజకీయ అంశాల గురించి ఆ రకంగా నాయకులు మాట మారిస్తే పెద్దగా ఇబ్బంది లేదు. కానీ నిరుపేదలు, నిజంగా అవసరంలో ఉన్నవారు, తమ మాటలు నమ్మి ఆశలు పెంచుకునే వారిని వంచించేలా రెండు నాల్కల ధోరణితో మాటమార్చే వైఖరి అనుసరిస్తే మాత్రం ఖండించాల్సిందే. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం నాయకులు, ప్రత్యేకించి ఎంపీలు ఈ పనే చేస్తున్నారు.

జీఎస్టీ విషయానికి వస్తే.. కేంద్రంలో అంటకాగుతున్న పార్టీగా.. అందులోని ఏ అంశాన్ని కూడా వ్యతిరేకించే.. మార్పుచేర్పులను డిమాండ్ చేసే స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. ఇదే సమయంలో.. విపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డి.. రాష్ట్రంలో వేలాది మంది నిరుపేదలకు బతుకుతెరువు అయిన చేనేత రంగంపై ఇదివరలో లేని జీఎస్టీని విధించరాదంటూ.. కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తమ వాదనను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా తమ ఎంపీలకు కూడా పురమాయించారు. పార్లమెంటు సమావేశాల్లో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఈ విషయమై గట్టిగా తమ వినతిని చెప్పారు కూడా. తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విషయంలో ‘మౌనమె నీ భాష ఓ మూగమనసా’ అనే ధోరణినే అవలంబించింది. ఈ జీఎస్టీ వల్ల రాష్ట్రంలోని చేనేత రంగం ఎంతగా కుదేలవుతుందనే విషయాన్ని వారసులు పట్టించుకోలేదు.

అయితే తెదేపా ఎంపీ నిమ్మల కిష్టప్ప మాత్రం.. దీక్షలు చేస్తున్న చేనేత కార్మికుల వద్దకు వెళ్లి.. జీఎస్టీ ఎత్తేయించడం గురించి కేంద్రంలో డిమాండ్ చేస్తా అంటూ మాటలు చెబుతున్నారు. ఏ రోటికాడ ఆ పాట పాడడంలో వింతేమీ లేదు గానీ.. ఇన్నాళ్లు పార్లమెంటు జరిగితే.. ఒక్కసారి కూడా ఆ అంశంపై నోరు మెదపని ఎంపీ గారు... చేనేత వారి వద్దకు వచ్చినప్పుడు మాత్రం.. కేంద్రం దృష్టికి ఈ విషయం తీసుకువెళ్తా.. పన్ను ఎత్తేయిస్తా.. అంటూ ఎలా బుకాయించగలుగుతున్నారో అర్థం కావడం లేదు. ఈ బుకాయింపులు తెదేపా నాయకులకు అలవాటైపోయిందా అనిపిస్తోంది.