Begin typing your search above and press return to search.

బుచ్చ‌య్య నోట‌!... తిరుగుబాటు మాట‌!

By:  Tupaki Desk   |   3 Feb 2018 11:59 AM GMT
బుచ్చ‌య్య నోట‌!... తిరుగుబాటు మాట‌!
X
మొన్న‌టి కేంద్ర బ‌డ్జెట్‌ లో న‌రేంద్ర మోదీ స‌ర్కారు... ఏపీకి మొండి చెయ్యే చూపించింది. ఏపీకే కాకుండా మొత్తంగా తెలుగు నేల‌కే కేంద్రం పంగ‌నామాలు పెట్టింద‌న్న రీతిలో విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. ఈ విష‌యంలో ఎవ‌రిది త‌ప్పు - ఎవ‌రిది ఒప్పు అన్న విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే... తెలంగాణ‌కు నిధులు కేటాయించ‌లేదంటే... అందులో పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌ని లేదు. ఎందుకంటే... విభ‌జ‌న త‌ర్వాత ఆ రాష్ట్రం ధ‌నిక రాష్ట్రంగానే అవ‌త‌రించింది. అంతేకాకుండా కేంద్రంలోని ఎన్డీఏలో టీఆర్ ఎస్ భాగ‌స్వామి కూడా కాదు. ఏపీ ప‌రిస్థితి అలా కాదు క‌దా. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ... ఎన్డీఏ కూటమిలో కీల‌క భాగ‌స్వామి. న‌రేంద్ర మోదీ కేబినెట్‌ లో రెండు కీల‌క మంత్రి ప‌ద‌వుల‌ను ద‌క్కించుకున్న పార్టీ. మ‌రి అలాంటి పార్టీ పాల‌న‌లో ఉన్న ఏపీకి కేంద్ర బ‌డ్జెట్‌ లో నిధుల కేటాయింపు జ‌ర‌గ‌క‌పోతే... ఆ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిన‌ట్లే క‌దా.

అంతేకాకుండా విభ‌జ‌న త‌ర్వాత అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ... ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. రాష్ట్రాన్ని ఇబ్బందుల నుంచి గ‌ట్టెక్కిస్తామ‌ని హామీ ఇచ్చిన న‌రేంద్ర మోదీ స‌ర్కారు... ఇప్ప‌టిదాకా చేసేందేమీ లేదు. అంతేకాకుండా ఈ ఐదేళ్ల టెర్మ్‌ లో చిట్ట‌చివ‌రి బ‌డ్జెట్ గా ప్ర‌వేశ‌పెట్టిన మొన్న‌టి బ‌డ్జెట్ లోనైనా ఏపీకి భారీ కేటాయింపులు ఉంటాయ‌ని అంతా ఆశించారు. అయితే అందుకు విరుద్ధంఒగా వ్య‌వ‌హ‌రించిన మోదీ స‌ర్కారు... ఏపీకి నిజంగానే పంగనామాలు పెట్టేసింది. ఈ నేప‌థ్యంలో బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుందామ‌న్న కోణంలో ఆలోచించిన చంద్ర‌బాబు... ఎందుక‌నో గానీ రాత్రికి రాత్రి త‌న నిర్ణ‌యాన్ని మార్చేసుకున్నారు. బాబు మౌనంతో ఆ పార్టీ ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే మాట‌ను ప‌క్క‌న‌పెట్టేశారు.

ఈ నేప‌థ్యంలో కాస్తంత ఆల‌స్యంగా రంగంలోకి దిగిన టీడీపీ సీనియ‌ర్ నేత‌ - రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి... సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నేటి మ‌ధ్యాహ్నం రాజ‌మ‌హేంద్ర‌వరంలో మీడియా ముందుకు వ‌చ్చిన బుచ్చ‌య్య‌... కేంద్రం వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరు చూశాక కేంద్ర సర్కారుపై తమ భ్రమలు పటాపంచలయ్యాయని అన్నారు. ఓపిక నశిస్తే ఏపీ ప్ర‌జ‌లు తిరగబడతారని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌ పై ప్రతి సీమాంధ్రుడి గుండె రగలిపోతోందని, కేంద్ర సర్కారు సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని విమ‌ర్శించారు. తాము ఇప్పుడు కూడా బీజేపీతో మిత్ర‌త్వంతో ముందుకు వెళ్ల‌డం మంచిది కాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ విష‌యంపై పదిరోజుల్లో ఏదో ఒకటి తేలిపోతుందని ఆయ‌న జోస్యం చెప్పారు. మ‌రి బుచ్చ‌య్య చెప్పిన‌ట్లుగా బీజేపీతో మైత్రిపై చంద్ర‌బాబు ఎలాంటి కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.