Begin typing your search above and press return to search.

బుచ్చయ్య.. జోరు తగ్గిస్తే బాగుంటుందేమో..

By:  Tupaki Desk   |   16 March 2015 9:50 AM GMT
బుచ్చయ్య.. జోరు తగ్గిస్తే బాగుంటుందేమో..
X
మనిషి ఎలాంటి వాడైనా.. అతనికి కష్టం వస్తే..సాటి వారంతా సాయం చేయకున్నా.. అయ్యో పాపం అని మాత్రం అంటుంటారు. అది మనిషి నైజం. సాదాసీదా మనిషి విషయంలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఒక మహానేత వారసుడు.. ఏపీలో విపక్షంగా ఉన్న వ్యక్తికి కష్టం వచ్చి పడితే ఎలా స్పందిస్తారు?

సహజంగానే.. సానుకూలంగా స్పందిస్తారు. అయ్యో అంటారు. జాలి చూపిస్తారు. రాజకీయంలో అధికారపక్షంపై ఎవరికి సానుభూతి ఉండదు. ఎందుకంటే వారి చేతిలో అధికారం ఉంటుంది. కానీ.. విపక్షం పరిస్థితి అలా ఉండదు. అందుకే వారంతా ఒకవిధమైన సానుభూతి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో.. ఒక్కడ్ని చేసి మిగిలిన వారంతా కలిసి ఉతికి ఆరేస్తుంటే ఎలా ఉంటుంది?

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో అలాంటి పరిస్థితే నెలకొంది. జగన్‌పై ఏపీ అధికారపక్ష నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అధికారపక్షం విపక్షంపై మాటల దాడి కొత్తేం కాదు. కానీ.. చేసే దాడి నిర్మాణత్మకంగా ఉండి.. నిజమే.. వారు విమర్శించటంలో తప్పు లేదన్నట్లుగా ఉండాలే కానీ.. మరీ విరుచుకుపడుతున్నారే అన్నట్లుగా ఉండకూడదు.

తాజాగా టీడీపీ ఎమ్మెల్యే.. సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు.. అయ్యో జగన్‌ బాబు ఎన్ని మాటలు పడుతున్నాడన్న భావన కలగటం ఖాయం. ఎందుకంటే.. ఆ స్థాయిలో బుచ్చయ్య చౌదరి జగన్‌ ను ఉతికి ఆరేశారు.

జగన్‌ ను ఎర్రగడ్డ మెంటల్‌ ఆసుపత్రికి పంపాలని.. జగన్‌ వీధి నాయకుడి కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ చరిత్ర హీనం కాబోతుందని ఆయన వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. కావాలంటే జగన్‌ లోటస్‌ పాండ్‌ లో సభ ఏర్పాటు చేసుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవచ్చని.. కానీ.. ప్రజలకు సంబంధించి అసెంబ్లీలోఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదని వ్యాఖ్యానించారు. సరిగ్గా ఇవే మాటల్ని బుచ్చయ్య చౌదరి కూడా గుర్తు పెట్టుకొని ఉంటే బాగుంటుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.