Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు బుల్లెట్ ట్రైన్.. ఎక్కడికంటే?

By:  Tupaki Desk   |   28 Sep 2021 6:31 AM GMT
హైదరాబాద్ కు బుల్లెట్ ట్రైన్.. ఎక్కడికంటే?
X
అవును.. హైదరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది. అయితే.. ఇప్పటికిప్పుడే కాదు కానీ కొంతకాలం పడుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని నుంచి దేశ వాణిజ్య రాజధాని ముంబయి మధ్య నడిపేందుకు వీలుగా ఈ బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు.

గమ్యస్థానాలకు త్వరితగతిన చేరుకునేందుకు వీలుగా .. దేశీయంగా రైలు ప్రయాణాల్లో విప్లవాత్మక మార్పులకు వీలుగా బుల్లెట్ రైళ్ల మీద ఫోకస్ చేసింది మోడీ సర్కారు.

ఇందుకు తగ్గట్లే ఇప్పటికే దేశీయంగా కొన్ని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు షురూ అయ్యాయి. తాజాగా హైదరాబాద్ - ముంబయి మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన తెర మీదకు రావటమే కాదు.. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలకు సంబంధించిన సర్వేను నిర్వహించిన డీపీఆర్ ను సిద్ధం చేస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నవంబరు 18న ప్రాజెక్టు నిర్మాణ టెండర్లు ఓపెన్ చేయనున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను జాతీయ హైస్పీడ్ రైలు కార్పొరేషన్ సిద్ధం చేస్తోంది.

ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే.. ప్రస్తుతం హైదరాబాద్ - ముంబయి మధ్య ఉన్న 14 గంటల ప్రయాణ సమయం కాస్తా.. కేవలం మూడు నాలుగు గంటల మధ్య ముగియనుంది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.లక్ష కోట్ల మేర ఉంటుందని.. ప్రభుత్వ.. ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని నిర్మిస్తారని చెబుతున్నారు. ప్రాజెక్టు ఖర్చును తగ్గించేందుకు వీలుగా వికారాబాద్ మీదుగా ఈ బుల్లెట్ ట్రైన్ ను నిర్వహించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మామూలుగా అయితే ముంబయి.. పూణె.. జహీరాబాద్ మీదుగా హైదరాబాద్ వరకు 780 కిలో మీటర్ల ఉండగా.. అందుకు బదులుగా ముంబయి - పూణె - గుల్బార్గా - తాండూరు - వికారబాద్ మీదుగా అలైన్ మెంట్ మార్చటం ద్వారా 649 కిలోమీటర్లకు తగ్గుతుందని చెబుతున్నారు.

డీపీఆర్ రెఢీ అయ్యాక ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తి అవుతుందన్నది స్పష్టత రానుంది. ప్రాజెక్టుకోసం కొత్తగా రైల్వే ట్రాక్ సిద్ధం చేస్తారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ట్రాక్.. బుల్లెట్ రైలు వేగాన్ని తట్టుకోలేదు. దీనికి సంబంధించిన టెర్మినల్ ముంబయిలో స్థలం లేకపోవటంతో.. నవీ ముంబయిలోని ఎయిర్ పోర్టు టెర్మినల్ భూగర్భంలో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ బుల్లెట్ ట్రైన్ కోసం ప్రతి 10 కిలోమీటర్ల దూరానికి ఒక పిల్లర్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ట్రైన్ గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దేశీయంగా ఇప్పటికే ఎనిమిది బుల్లెట్ ట్రైన్ కారిడార్లను సిద్ధం చేశారు. అందులో తెలుగు ప్రాంతాల మీదుగా వెళ్లే ఒకే ఒక్క బుల్లెట్ ట్రైన్ ఇదొక్కటే కావటం గమనార్హం.