Begin typing your search above and press return to search.

పురంధేశ్వరిని ఎంతమాట అనేశాడు

By:  Tupaki Desk   |   5 Nov 2015 4:13 AM GMT
పురంధేశ్వరిని ఎంతమాట అనేశాడు
X
రాజకీయాలు అన్నాక అంతే. మాట అనటం ఎంత సింఫులో.. మాట పడటం కూడా అంతే సులువు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించి.. తన క్యాబినెట్ లో ఆమె లాంటి వ్యక్తి ఉండటం గర్వంగా ఉందంటూ తన పనితీరుతో ప్రశంసలు అందుకున్నారు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి. అలాంటి ఆమెను తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్సీ తీవ్రస్థాయిలో విమర్శించటం చూసినప్పుడు రాజకీయాల్లో అంతేనని అనిపించక మానదు.

రాజకీయ అరంగ్రేటం చేసినప్పటి నుంచి తీవ్ర విమర్శలు పెద్దగా ఎదుర్కోని పురంధేశ్వరికి కొంతకాలంగా విమర్శలు బాగా ఇబ్బంది పెట్టేవే. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఒక రేంజ్ లో చెలరేగిపోయారు. ఇప్పటివరకూ ఆమెను ఏ రాజకీయ నేతా అనని పెద్ద మాట అనేశారు. "పురంధేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె గా చెప్పుకోవటానికి సిగ్గుచేటు" అని మండిపడ్డారు. మాజీ మంత్రి పద్నాలుగు పార్టీలు మార్చిన హరిరామ జోగయ్య రాసిన పుస్తక ఆవిష్కరణకు పురంధేశ్వరి వెళ్లటం ఆశ్చర్యంగా ఉందన్నారు.

ఎన్టీఆర్ కుమార్తె అయి ఉండి ఆమె అలా వెళతారా? అన్న ధర్మ సందేహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అనేక కుంభకోణాల్లో ఉన్నారని.. అలాంటి వ్యక్తి తమపై మాట్లాడతారా? అంటూ ప్రశ్నించిన బుద్దా.. వారంతా సోనియాగాంధీ ఏజెంట్లుగా అభివర్ణించారు. ఇంతకాలం పురంధేశ్వరిని టీడీపీ నేతలు పెద్దగా టార్గెట్ చేసేవారు కాదు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఆమెపై తీవ్రస్థాయిలో మండి పడిన దాఖలాలు లేవు. అలాంటిది.. తాజాగా మాత్రం తీవ్రస్థాయిలో మండిపడటం కాస్త ఆశ్చర్యకరమే.

విచిత్రమైన విషయం ఏమిటంటే.. హరిరామ జోగయ్య పుస్తకావిష్కరణకు మిగిలిన నేతల మాదిరే.. మంత్రి పీతల సుజాతతో పాటు.. పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు హాజరయ్యారు. వెళ్లింది హరిరామజోగయ్య కార్యక్రమం కావటంతో.. ఆయన్ను కాసేపు పొగిడేసి వచ్చేశారు. మరి.. సొంత పార్టీ నేతలు జోగయ్యను పొగిడేసిన దానికి ప్రశ్నించని బుద్దా.. పురంధేశ్వరి మాత్రం విరుచుకుపడటం ఏమిటో..?