Begin typing your search above and press return to search.

తమ్ముళ్ల ఆశ మామూలుగా లేదే

By:  Tupaki Desk   |   16 April 2016 8:03 AM GMT
తమ్ముళ్ల ఆశ మామూలుగా లేదే
X
అంతా నాకే కావాలనుకోవటం ఏ మాత్రం సమంజసంగా అనిపించుకోదు. ఆశను ప్రజలు ఒప్పుకుంటారు. కానీ.. అత్యాశను మాత్రం అసహ్యించుకుంటారు. దూకుడు రాజకీయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఆపరేషన్ ఆకర్ష్ లను ప్రయోగించటాన్ని ప్రజలు ఒక స్థాయి వరకూ ఓకే అనుకుంటారు. దాన్ని అలుసుగా తీసుకొని తాము తప్ప మరే పార్టీ ఉండకూదన్నట్లుగా వ్యవహరిస్తే మాత్రం మొదటికే మోసం రావటం ఖాయం.

తాజాగా తెలుగు తమ్ముళ్ల మాటలు ఇంచుమించు ఇలానే ఉన్నాయి. ఏ ఆకర్ష్ అస్త్రానికి తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయారో.. అదే అస్త్రాన్ని ఏపీలో ప్రయోగించి విపక్ష నేత జగన్ కు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ ఆకర్ష్ అన్నది బలాన్ని పెంచుకోవటానికి అయుధంగా ఉపయోగించుకోవాలే కానీ.. ప్రత్యర్థుల్ని పూర్తిగా అణగదొక్కటానికి వినియోగించుకోకూడదన్న విషయాన్ని తమ్ముళ్లు అర్థం చేసుకున్నట్లు లేదు.

తాజాగా ఏపీ అధికారపక్ష ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాటలే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా మే నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందంటూ జోస్యం చెప్పారు. మే చివరకు జగన్ పార్టీ ఖాళీ అవుతుందని.. ఏపీలో తెలుగుదేశం అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని వ్యాఖ్యానించారు. విపక్షం లేని అధికారపక్షం ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదన్న విషయం బుద్దా వెంకన్న లాంటి వారికి చెప్పినా అర్థం చేసుకోలేరేమో. వ్యూహాత్మకంగా ప్రయోగించే ఆకర్ష్ కు ప్రజల అండదండలు ఉంటాయే కానీ.. అదే పనిగా ప్రయోగించి.. ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ధోరణిని ప్రజలు బరితెగింపుగా భావిస్తారన్న విషయాన్ని బాబు బ్యాచ్ గ్రహిస్తే మంచిది. ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు కాస్త ముందువెనుకా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది.