Begin typing your search above and press return to search.

బీజేపీకి ఎంతో చేశామంటున్న టీడీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   7 May 2016 9:59 AM GMT
బీజేపీకి ఎంతో చేశామంటున్న టీడీపీ ఎమ్మెల్యే
X
తెలుగుదేశం పార్టీకి చెందిన రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మ‌రోమారు కేంద్ర ప్ర‌భుత్వం - బీజేపీ తీరుపై మండిప‌డ్డారు. కేంద్ర ప్రభుత్వం విదిల్చే నిధులు కష్టాల్లో ఉన్న ఆంధ్ర‌ప్రదేశ్‌ రాష్ట్రానికి ఏమాత్రం సరిపోవని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చారో బీజేపీ నేత‌ల‌కు తెలుసా అని ప్ర‌శ్నించారు. నిధులు ఇచ్చింది ఎంతో కూడా తెలియకుండా భాజపా నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమ‌రావ‌తిలో మౌలిక సదుపాయాల కల్పనకే రూ. 54 వేల కోట్లు అవసరం కాగా కేంద్రం ఇచ్చిన రూ. రెండు వేల కోట్లు ఏమూలకు సరిపోతాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అనేక జాతీయ సంస్థలను ప్రకటించినా వాటికి విలువైన భూములు - విద్యుత్తు - నీరు - ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమేనని తెలుసుకోవాలన్నారు. పోలవరం నిర్మాణ బాధ్యత మాదేనన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పడు నాబార్డ్‌ నిధులతో నిర్మిస్తామని చెబుతోందన్నారు. నాబార్డ్‌ నిధులతో నిర్మిస్తే ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయని వాటికి రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉంద‌ని బుచ్చ‌య్య చౌద‌రి అన్నారు. కేంద్రానికి పన్నుల రూపంలో రూ. లక్షల కోట్లు చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలకోసం ముఖ్యమంత్రి ఎన్నిసార్లు డిల్లీ చుట్టూ తిరగాలని గోరంట్ల ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ తిరుపతి సభలో రాష్ట్రానికి న్యాయం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. హుద్‌ హుద్‌ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన మూడు జిల్లలాకు ఇచ్చిన వాగ్దానాలే ఇంత వరకు నెరవేరలేదని విమర్శించారు.

ఆర్థిక లోటుతో ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గోరంట్ల‌ స్పష్టం చేశారు. కేంద్ర ఇచ్చిన నిధులను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన అప్పటి ప్రధాని విభజన చట్టంలో ఆ అంశాన్ని ఎందుకు పొందుపరచలేదన్నారు. తాము మిత్రధర్మాన్ని పాటించి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా భాజపాకు ఒక రాజ్యసభ, ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని గుర్తుచేశారు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ అమలు చేయడంతోపాటు ప్రత్యేక హోదా, రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వైషమ్యాలను తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చివరి వరకు పోరాటం చేస్తామని వివరించారు. దీనికోసం కలిసివచ్చే వారందిరినీ కలుపుకువెళతామని స్పష్టం చేశారు.