Begin typing your search above and press return to search.

మాయావతి మాట‌!.. మోదీ బీసీ కాద‌ట‌!

By:  Tupaki Desk   |   10 May 2019 4:19 PM GMT
మాయావతి మాట‌!.. మోదీ బీసీ కాద‌ట‌!
X
ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కులం కార్డు బాగానే ప‌నిచేస్తున్న‌ట్లు ఉంది. త‌న ఐదేళ్ల పాల‌న‌లో దేశానికి, దేశ ప్ర‌జ‌ల‌కు ఏం చేశానో చెప్పి ఓటేయాల‌ని అభ్య‌ర్థించాల్సిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ... ఆ విష‌యాన్ని అస‌లు ప‌ట్టించుకున్న‌ట్లుగానే లేర‌న్న వాద‌న ఉంది. కేవలం పాక్ పై జ‌రిపిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌ను ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్న మోదీ... దేశం భ‌ద్రంగా ఉండాలంటే బీజేపీనే మ‌రోమారు అధికారంలోకి రావాల్సి ఉందని ఆయ‌న చెబుతున్నారు. ఈ అంశం త‌ర్వాత ఆయ‌న కేవ‌లం కులం కార్డును ప్ర‌యోగిస్తున్నారు. తాను బీసీన‌ని, ఓ బీసీ ప్ర‌ధానిగా ఉండ‌టం విప‌క్షాలు స‌హించ‌లేక‌పోతున్నాయ‌ని ఏకంగా త‌న‌దైన శైలి దాడి మొద‌లెట్టారు.

అయితే మోదీ వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికే ఓ సారి స్పందించిన బీఎస్పీ అధినేత్రి, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం మాయావ‌తి... మ‌రోమారు త‌న‌దైన శైలిలో రిట‌ర్న్ పంచ్ ఇచ్చారు. మోదీ అస‌లు బీసీనే కాద‌ని కూడా ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. న‌రేంద్ర మోదీ నిజ‌మైన బీసీ కాద‌ని పేర్కొన్న బెహ‌న్ జీ... అలా తాను ఎందుకు చెబుతున్నాన‌న్న రీజ‌నింగ్ ను కూడా వినిపించారు. ఒక‌వేళ మోదీ ఓబీసీకి చెందిన‌వారే అయి ఉంటే… ఆర్.ఎస్.ఎస్. ఆయ‌న‌కు ఈ మేర‌ ప్రాధాన్య‌త ఇచ్చేదే కాద‌ని, ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా కూడా ఆయ‌న పేరును తెర‌మీదికి తీసుకొచ్చేవారు కాద‌ని మాయావ‌తి కొత్త రీజ‌నింగ్ ను వినిపించారు. బీసీల‌ను ప్ర‌ధాని చేసే ప‌రిస్థితి అక్క‌డ ఉందా? అని ప్ర‌శ్నించిన ఆమె... అస్స‌లు అలాంటి ప‌రిస్థితే అక్క‌డ‌ ఉండ‌ద‌న్నారు.

పుట్టుక‌తోనే మోదీ బీసీ అయి ఉంటే, దేశంలో వెన‌క‌బ‌డిన వర్గాల ప్ర‌జ‌లు ప‌డే క‌ష్టాలు ఆయ‌న‌కి అర్థ‌మ‌య్యేవ‌ని మాయావ‌తి మ‌రో పంచ్ విసిరారు. మోదీ మ‌రోసారి ప్ర‌ధాన‌మంత్రి అయ్యే అవ‌కాశాలు ఇప్పుడు లేవ‌నీ, కానీ మ‌ళ్లీ తానే ప్ర‌ధాని కాబోతున్నాన‌నే క‌ల‌లు మోదీ కంటున్నార‌ని మాయావ‌తి ఎద్దేవా చేశారు. ఇప్పుడు భాజ‌పా ఓట‌మి అంచున ఉంద‌నీ, అందుకే మోదీలో అస‌హ‌నం పెరిగిపోయి... ప్ర‌తిప‌క్షాల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆమె అన్నారు. కేవ‌లం ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందేందుకే త‌న కులాన్ని వెన‌క‌బ‌డిన వ‌ర్గాల జాబితాలో మోదీ చేర్చుకున్నార‌ని మాయావ‌తి త‌న‌దైన శైలి విమ‌ర్శ‌లు సంధించారు. మ‌రి మాయావ‌తి వ్యాఖ్య‌ల‌పై మోదీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.