Begin typing your search above and press return to search.

యోగీ రాజీనామా చేసి - మఠానికి వెళ్లండి - రాష్ట్రపతి పాలన పెట్టండి..!

By:  Tupaki Desk   |   1 Oct 2020 3:02 PM GMT
యోగీ రాజీనామా చేసి - మఠానికి వెళ్లండి - రాష్ట్రపతి పాలన పెట్టండి..!
X
ఉత్తరప్రదేశ్‌ లో వరుసగా జరుగుతున్న హత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ లో హత్రాస్ ఘటన మరువకముందే, బలరాంపూర్ ఘటనజరగడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ వరుస అత్యాచార ఘటనలపై బీఎస్ ‌పీ అధినేత మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నేరస్థులు - మాఫియా - రేపిస్టులకు అడ్డూ అదుపూలేకుండా పోతోందన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో నేరాలు - ముఖ్యంగా దళిత బాలికలపై నేరాలు పెరిగిపోతున్నాయంటూ యోగిపై ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాయావతి డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తోందని - మహిళలకు రక్షణ లేకుండా పోయిందని - సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు యోగీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారన్నారని - మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు జరగని రోజు ఒక్కటి కూడా లేదని విమర్శించారు. తనకూ ఒక ఆడకూతురు ఉందనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని, ఆడబిడ్డలను రక్షించ లేని యోగి వెంటనే రాజీనామా చేయాలని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని ఆయన స్వ‌స్థ‌ల‌మైన గోర‌ఖ్‌ పూర్ మ‌ఠానికి పంపించాల‌న్నారు.

అలాగే హత్రాస్ హత్యాచార బాధితురాలి మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించకుండా, అర్ధరాత్రి దహనం చేసిన యూపీ పోలీసులపై మాయావ‌తి మండిపడ్డారు. ఇది సిగ్గుచేటైన సంఘటన అని బీఎస్పీ చీఫ్ దుయ్యబట్టారు. ఇది జంగిల్‌రాజ్యం కాకపోతే, మరేంటి? అని ప్రశ్నించారు. బాధితుల కుటుంబానికి అండగా నిలిచిన ప్రతిపక్షాలను ప్రశంసించిన మాయవతి తమ పార్టీ కూడా బాధిత కుటుంబం తరపున పోరాడుతుందన్నారు.