Begin typing your search above and press return to search.

ఢిల్లీలో కూలిన విమానం...10 మంది మృతి

By:  Tupaki Desk   |   22 Dec 2015 7:40 AM GMT
ఢిల్లీలో కూలిన విమానం...10 మంది మృతి
X
ఢిల్లీలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. విమానంలో సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో విమానం కుప్ప‌కూలిపోయింది. ఈ విమానాన్ని రాంచీకి చెందిన బీఎస్ ఎఫ్ విమానంగా గుర్తించారు. ఈ ఘటనలో అందులో ఉన్నపదిమంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు బీఎస్ ఎఫ్ అధికారులు విమాన సిబ్బంది, మిగిలిన‌వారు సాంకేతిక నిపుణులు. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ లోగల బాడ్పోలా గ్రామం వద్ద విమానాశ్రయ ప్రహరీ గోడకు ఈ విమానం ఢీకొనడంతో ఘటన చోటుచేసుకుంది. విమానంలో మొత్తం పదిమందే ఉన్నట్లు తెలిసింది.

మంగళవారం ఉదయం 9.50 గంటల స‌మ‌యంలో తమ విమానం దిగేందుకు అనుమతివ్వాల‌ని విమాన సిబ్బంది కోరారని, ఆ వెంటనే కొద్ది సేపటికే తమతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విమానం దించేందుకు అనుమతి ఇవ్వగానే విమానాశ్రయంలో విమానాన్ని దించేందుకు ప్రయత్నిస్తుండగా విమానం అక్కడున్న‌ గోడను ఢీకొట్టిన‌ అనంతరం అది కూలిపోయినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. గోడను ఢీకొట్టిన విమానం అనంతరం ఓ సెఫ్టిక్ ట్యాంకులోకి పడిపోయింది. అక్క‌డ‌ మంటలు భారీగా వ్యాపించాయి. దాదాపు 18 ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్ర‌య‌త్నించాయి. ఇది కూలిన చోటే రైల్వే లైన్ కూడా ఉంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా ఘటన స్థలి వద్దకు వచ్చి ఆప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై ఆరా తీసిన కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు.