Begin typing your search above and press return to search.

11 రోజుల్లో 35 వేల బుల్లెట్లు దిగాయి

By:  Tupaki Desk   |   1 Nov 2016 5:59 PM GMT
11 రోజుల్లో 35 వేల బుల్లెట్లు దిగాయి
X
మనం ఇక్కడ కూర్చుని సర్జికల్ స్ట్రైక్స్ గురించి.. సరిహద్దుల్లో సైన్యం పోరాటాల గురించి.. పాకిస్థాన్ నటుల్ని బహిష్కరించడం గురించి తాపీగా చర్చలు పెట్టుకుంటున్నాం. కొందరు సైన్యం గురించి తక్కువ చేసి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ల విశ్వసనీయతనే శంకిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఐతే సైన్యం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. శత్రు సైన్యంతో భీకర పోరాటం సాగిస్తోంది. కేవలం 11 రోజుల వ్యవధిలో 35 వేల బుల్లెట్లను మన సైన్యం వినియోగించిందంటేనే.. సరిహద్దుల్లో పోరు ఏ స్థాయిలో జరుగోతోందో అంచనా వేయొచ్చు. ఈ పదకొండు రోజుల్లో పాకిస్థాన్ 60 సార్లు కవ్వింపు చర్యలకు పాల్పడటం గమనార్హం. అయినా దేశానికి ఎలాంటి ఇబ్బందీ రాకుండా ప్రశాంతంగా ఉంటున్నామంటే అది సైన్యం రేయింబవళ్లు కాపు కాస్తూ చేస్తున్న పోరాటం వల్లే.

గత మూడు నెలల నుంచి భారత సైన్యంలో ఎవ్వరికీ సెలవుల్లేవు. మెడికల్ ఎమర్జెన్సీ వస్తే తప్ప సెలవు ఇవ్వట్లేదు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ రేయింబవళ్లు పని చేస్తున్నారు. సరిహద్దుల్లో ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడుతున్నారు. దేశవ్యాప్తంగా జనమంతా దీపావళి టపాకాయలు కాలుస్తూ వేడుకలు చేసుకుంటుంటే.. సైనికులు మాత్రం తుపాకులు పట్టి పోరాటం సాగిస్తున్నారు. ఎంఎంజీలు.. ఎల్ఎంజీలు.. రైఫిళ్లు.. సుదూర లక్ష్యాల్ని ఛేదించే మోటార్ షెల్స్.. ఇలా రకరకాల ఆయుధాల్ని వినియోస్తోంది సైన్యం. జమ్మూ సెక్టార్లో రాత్రి పూట కాల్పుల మోత మోగుతున్నట్లు సమాచారం. అక్టోబరు 19 నుంచి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ పదే పదే కవ్విస్తుండటంతో వారికి దీటుగా బదులిస్తోంది మన సైన్యం.