Begin typing your search above and press return to search.

ఎలుక మాదిరి సొరంగం త‌వ్విన పాకిస్తాన్‌

By:  Tupaki Desk   |   1 Oct 2017 5:17 AM GMT
ఎలుక మాదిరి సొరంగం త‌వ్విన పాకిస్తాన్‌
X
త‌ప్పులు చేస్తూ.. ప్ర‌పంచ దేశాల ముందు త‌లదించుకునే ప‌రిస్థితులు ఎదురైనా సిగ్గులేని రీతిలో వ్య‌వ‌హ‌రిస్తోంది దాయాది పాకిస్తాన్‌. త‌న పాడుబుద్ధిని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌ద‌ర్శించుకునే పాక్ దుష్ట‌బుద్ధి మ‌రోసారి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎలుక మాదిరి స‌రిహ‌ద్దుల్లో సొరంగాన్ని త‌వ్విన పాక్ ప‌న్నాగం మ‌రోసారి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కశ్మీర్ లోని ఆర్ ఎస్ పురా సెక్టార్ లోని ఆర్నియా ప్రాంతంలో పాక్ నిర్మించిన సొరంగ‌ మార్గాన్ని బీఎస్ ఎఫ్ జ‌వానులు గుర్తించారు. పాక్ స‌రిహ‌ద్దుల్లో నుంచి భార‌త భూభాగంలోకి మిలిటెంట్లు చొచ్చుకొచ్చేందుకు వీలుగా 14 అడుగుల పొడ‌వుతో తవ్విన సొరంగాన్ని తాజాగా గుర్తించారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే పాకిస్తాన్ రేంజ‌ర్లు.. బోర్డ‌ర్ సెక్యురిటీ ఫోర్స్ స‌మావేశం ముగిసిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఈ సొరంగ‌మార్గాన్ని భార‌త అధికారులు గుర్తించిన‌ట్లుగా తెలుస్తోంది.

ఆయుధాల‌తో భార‌త్‌ లోకి ప్ర‌వేశించేందుకు వీలుగా ఈ సొరంగాన్ని త‌వ్వి ఉంటార‌ని భావిస్తున్నారు. భార‌త స‌రిహ‌ద్దుల్లోకి ఈజీగా వ‌చ్చేందుకు వీలుగా ఈ సొరంగ‌మార్గం ఉండ‌టం గ‌మ‌నార్హం. ఆ మ‌ధ్య‌న విడుద‌లైన సూప‌ర్ హిట్ అయిన భ‌జ‌రంగీ భాయేజాన్ చిత్రంలోనూ ఈ త‌ర‌హా సొరంగాలకు సంబంధించిన సీన్ ఉంటుంది. తాజాగా గుర్తించిన సొరంగ మార్గం ఇదే రీతిలో ఉండ‌టం విశేషం.

పండ‌గల నేప‌థ్యంలో యావ‌ద్దేశ‌మంతా సంబ‌రాల్లో మునిగిన వేళ‌.. గుట్టుచ‌ప్పుడు కాకుండా దేశంలోకి అక్ర‌మంగా చొర‌బ‌డేందుకు వీలుగా సొరంగ మార్గాన్ని ఎంచుకున్న‌ట్లుగా భావిస్తున్నారు. అక్ర‌మంగా ప్రవేశించి..విధ్వంసం సృష్టించేందుకు వీలుగా సొరంగ ప‌న్నాగాన్ని ప‌న్నిన‌ట్లుగా అంచ‌నా వేస్తున్నారు. స‌రిహ‌ద్దుల్లో అనుమానాస్ప‌దంగా న‌లుగురు వ్య‌క్తులు క‌నిపించ‌టంతో బీఎస్ఎఫ్ ద‌ళాలు కాల్పులు జ‌రిపాయి. అనంత‌రం వారు పాక్ వైపు పారిపోయారు. దీంతో.. సందేహం వ‌చ్చిన భార‌త బ‌ల‌గాలు త‌నిఖీలు నిర్వ‌హించ‌గా ఈ సొరంగ‌మార్గం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ త‌ర‌హా సొరంగాల్ని గుర్తించేందుకు స‌రికొత్త టెక్నాల‌జీని ఇక‌పై వినియోగిస్తామ‌ని అధికారులు చెబుతున్నారు.

సొరంగం త‌ర‌హాలో త‌న దుష్ట‌బుద్ధిని బ‌య‌ట‌పెట్టుకోవ‌టం పాక్‌కు కొత్తేం కాదు. 2012లో తొలిసారి సాంబా సెక్టార్ లో ఒక సొరంగాన్ని అధికారులు గుర్తించారు. ఇది మొత్తం 540 మీట‌ర్ల పొడ‌వున ఉంది. త‌ర్వాత 2014లో మ‌రోసారి ఇదే త‌ర‌హాలో సొరంగాన్ని గుర్తించారు. కాకుంటే అది కేవ‌లం 50 మీట‌ర్లు మాత్ర‌మే ఉంది. ఎలుక మాదిరి దుష్ట‌బుద్ధితో పాక్ సొరంగ ప‌న్నాగాలపై భార‌త్ పెద్ద ఎత్తున దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.