Begin typing your search above and press return to search.

సుదీర్ఘ డ్రామాకు తెర ప‌డింది.. బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన య‌డ్డీ!

By:  Tupaki Desk   |   29 July 2019 7:25 AM GMT
సుదీర్ఘ డ్రామాకు తెర ప‌డింది.. బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన య‌డ్డీ!
X
అనుకున్న‌దే జ‌రిగింది. అంచ‌నాలు త‌ప్పు కాలేదు. సుదీర్ఘ‌కాలంగా క‌ర్ణాట‌క‌లో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభానికి తెర ప‌డింది. తాజాగా జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష‌లో య‌డ్డీ స‌ర్కారు పాస్ కావ‌టంతో గ‌డిచిన కొన్ని నెల‌లుగా సా..గుతున్న రాజ‌కీయ సంక్షోభం ఒక కొలిక్కి రావ‌ట‌మే కాదు..క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వం ప‌ని చేయటం ఇక షురూ అవుతుంద‌ని చెప్పాలి.

కుమార‌స్వామి ప్ర‌భుత్వం రాజ‌కీయ సంక్షోభంలోకి వెళ్ల‌టం.. ప‌లువురు ఎమ్మెల్యేలు రాజీనామాను స‌మ‌ర్పించ‌టం.. కొంద‌రిపై అన‌ర్హ‌త వేటు క‌త్తి వేలాడ‌టం లాంటి అంశాల నేప‌థ్యంలో.. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా చోటు చేసుకున్న ప‌రిణామాలతో ప‌లువురు ఎమ్మెల్యేల‌పై వేటు వేస్తూ స్పీక‌ర్ ర‌మేశ్ కుమార్ నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా.. య‌డ్డీ స‌ర్కారు బ‌ల‌ప‌రీక్ష‌కు ఒక రోజు ముందే 17 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు ప‌డ‌టంతో.. య‌డ్డీ స‌ర్కారుకున్న గండాల‌న్ని తొల‌గిపోయాయి.

ఈ రోజు జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష‌లో మూజువాణి ఓటుతో బీఎస్ య‌డియూర‌ప్ప ప్ర‌భుత్వం పాస్ అయ్యింది. బీజేపీకి మ‌ద్ద‌తుగా 106 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. వీరిలో ఒక‌రు ఇండిపెండెంట్ కూడా ఉన్నారు. ఇక‌.. కాంగ్రెస్‌- జేడీయూ కు మ‌ద్ద‌తుగా 99 మంది ఓటేశారు. దీంతో.. య‌డియూర‌ప్ప ప్ర‌భుత్వం పాల‌న‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి.

తాజాగా జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష‌లో య‌డ్డీ ప్ర‌భుత్వం పాస్ కావ‌టంతో.. ఇప్పుడు ఆయ‌న పాల‌న మీద దృష్టి పెట్టే వీలుంది. తొలుత మంత్రిమండ‌లిని ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే.. అన‌ర్హ‌త వేటు ప‌డిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల సంఘం ఉప ఎన్నిక‌ల్ని నిర్వ‌హించే క్ర‌మంలో క‌న్న‌డ ప్ర‌జ‌లు ఇచ్చే తీర్పు య‌డ్డి స‌ర్కారు భ‌విష్య‌త్తును తేల్చేయ‌నుంద‌ని చెప్పాలి. ఈ ప్ర‌క్రియ‌కు మ‌రో ఆర్నెల్లు స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికైతే మాత్రం య‌డ్డి స‌ర్కారుకు ఎలాంటి అడ్డంకి లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

బ‌ల‌ప‌రీక్ష‌కు ముందు జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా య‌డ్డి.. సిద్ద‌రామ‌య్య‌ల మ‌ధ్య మాటల యుద్ధం సాగింది. మోడీ అడుగుజాడ‌ల్లో రైతుల‌కు సాయం చేస్తాన‌ని సీఎంయ‌డ్డి పేర్కొన‌గా.. తాను ఏడాదిన్న‌ర క్రిత‌మే య‌డ్డి ప్ర‌క‌టించిన ప‌థ‌కాన్ని తీసుకొచ్చిన‌ట్లుగా కౌంట‌ర్ ఇచ్చారు. 2018లో రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన సంద‌ర్భంగా రైత బెళ‌గ ప‌థ‌కాన్ని తెచ్చాన‌ని.. య‌డ్డి తీసుకొచ్చిన దాన్లో ప్ర‌త్యేక లేద‌ని తేల్చేశారు.