Begin typing your search above and press return to search.

ఫలితాలు రాగానే ప్రభుత్వం కూలుతుందట!

By:  Tupaki Desk   |   21 May 2019 6:02 PM GMT
ఫలితాలు రాగానే ప్రభుత్వం కూలుతుందట!
X
తన రన్నింగ్ కామెంట్రీని అస్సలు ఆపడం లేదు యడ్యూరప్ప. లోక్ సభ ఎన్నికలు ఫలితాలు రాగానే తను కర్ణాటకకు ముఖ్యమంత్రిని అయిపోతానంటూ ఆయన వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాగానే కర్ణాటకలోని సంకీర్ణ సర్కారు పడిపోతుందని ఆయన చెబుతూ వచ్చారు. మరి కొన్ని గంటల్లో ఆ ఫలితాలు వెల్లడి కాబోతున్న తరుణంలో కూడా యడ్యూరప్ప అదే విషయాన్ని చెప్పారు. ఫలితాలు రాగానే కర్ణాటకలో ప్రభుత్వం కుప్పకూలుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

తమతో కాంగ్రెస్ కు సంబంధించిన ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కొన్నాళ్లుగా యడ్యూరప్ప వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ఇప్పుడూ అదే మాటే చెబుతున్నారాయన. తమతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఫలితాలు వెల్లడి కాగానే వాళ్లంతా కాంగ్రెస్ ను వీడి తమతో చేతులు కలుపుతారని ఆయన చెప్పుకొచ్చారు.

కర్ణాటకలో సంకీర్ణ సర్కారు పరిస్థితి గురించి వివరించనక్కర్లేదు. మక్కోణపు పోటీలో పరస్పరం వ్యతిరేకంగా పోటీ చేసిన కాంగ్రెస్-జేడీఎస్ లు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయినా వారికి ఉన్నది బోటాబోటీ మెజారిటీనే. అందులోనూ ప్రస్తుతం మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలూ రావాల్సి ఉంది. వాటిల్లో బీజేపీ పట్టు సాధిస్తే.. కుమారస్వామి ప్రభుత్వానికి మరింత ఇబ్బంది ఏర్పడవచ్చు.

ఇక కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు తీవ్ర స్థాయికి చేరాయి. జేడీఎస్ అధికారాన్ని అనుభవిస్తోందంటూ కాంగ్రెస్ వాళ్లు అసహనంతో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ రాణిస్తే యడ్యూరప్ప చెబుతున్నదే జరగవచ్చునని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.