Begin typing your search above and press return to search.

క‌ల‌క‌లం రేపిన విద్యార్థిని దారుణ హ‌త్య‌!

By:  Tupaki Desk   |   12 Sep 2017 8:17 AM GMT
క‌ల‌క‌లం రేపిన విద్యార్థిని దారుణ హ‌త్య‌!
X
హైద‌రాబాద్ లో ఓ ఇంట‌ర్ విద్యార్థిని దారుణ హ‌త్య క‌ల‌క‌లం రేపింది. దుండ‌గులు అత్యంత పాశ‌వికంగా ఆమె గొంతు కోసి హ‌త్య‌చేశారు. అమీన్‌ పూర్‌ సమీపంలోని కొండల్లో విద్యార్థిని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో ఈ విష‌యం వెలుగులోకి వచ్చింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆ విద్యార్థిని బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న చాందిని జైన్‌ గా గుర్తించారు. సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్యా ఘటనాస్థలిని పరిశీలించారు. చాందినీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఘటనా స్థలంలో లభించిన ఫోన్ లోని చాందినీ కాంటాక్ట్స్ ఆధారంగా పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆమె కాల్ లిస్ట్ ను పరిశీలించి న‌లుగురు అనుమానితుల‌ను గుర్తించారు. ఆ నలుగురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగిలిన ఇద్దర్నీ అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. చాందిని కాంటాక్ట్స్ లో ఉన్న 'మై హాట్ ఫోన్ నెంబర్'తో ఆమె ఎక్కువగా మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. ఆ నలుగురూ చాందిని ఇంటికి ఎక్కువగా వ‌స్తుంటార‌ని విచార‌ణ‌లో తేలింది. అంతే కాకుండా పార్టీ కోసం జూబ్లీహిల్స్ లోని ఒక పబ్ కు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఈ హ‌త్య వెనుక ప్రేమ వ్య‌వ‌హారం ఏమన్నా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

మియపూర్ లోని దీప్తి శ్రీనగర్ స‌త్యనారాయణ ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త కిషోర్ జైన్ కుమార్తె చాందిని. ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుంది. ఈ నెల 9న కాలేజీ నుంచి ఇంటికొచ్చిన చాందిని సాయంత్రం ఐదున్నర గంటలకు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లింది. ఓ గంట తర్వాత చాందిని అక్క నివేదిత‌ కాల్ చేస్తే ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ అని వ‌చ్చింది. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఆ త‌ర్వాత ఆదివారం మియపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేస్ నమోదు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ రోజు ఉద‌యం అమీన్ పూర్ గుట్ట‌ల్లో చాందిని మృతదేహం ల‌భించింద‌ని పోలీసులు చాందినీ కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు. దీంతో ఆ కుటుంబం శోక‌సంద్రంలో మునిగిపోయింది. తన చెల్లిని కుట్రపూరితంగానే కిడ్నాప్ చేసి హత్య చేశారని నివేదిత జైన్ ఆరోపించారు. త‌న‌ చెల్లి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరారు.