Begin typing your search above and press return to search.

వరంగల్ లో ఘోరం..అనుమానంతో ప్రియురాలి గొంతు కోసి చంపేశాడు

By:  Tupaki Desk   |   11 Jan 2020 4:40 AM GMT
వరంగల్ లో ఘోరం..అనుమానంతో ప్రియురాలి గొంతు కోసి చంపేశాడు
X
వరంగల్ లో ఘోరం చోటు చేసుకుంది. అనుమానం పెనుభూతంగా మారటమే కాదు.. పిలిచినంతనే నమ్మి వచ్చిన ప్రియురాలి గొంతును కర్కసంగా కోసి చంపేసిన దారుణం బయటకు వచ్చింది. వరంగల్ లో తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. వరంగల్ కు చెందిన యువతి (23).. నిందితుడు షాహిద్ (23) ఇద్దరూ కలిసి డిగ్రీ చదివారు. వారి మధ్య మొదలైన స్నేహం తర్వాతి కాలంలో ప్రేమగా మారింది. డిగ్రీలో షాహిద్ తప్పితే.. ఆ అమ్మాయి మాత్రం పాస్ అయి.. ప్రస్తుతం ఎంబీఏ చేస్తోంది. షాహిద్ కుటుంబం కాజీపేటలో ఉంటోంది. షాహిద్ తండ్రి మటన్ షాపు నిర్వహిసతుంటే.. నిందితుడు గదిని అద్దెకు తీసుకొని ఉండేవాడు. ప్రస్తుతం ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. తనకు దగ్గరైన అమ్మాయి.. మరొకరితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానం పెను భూతంగా మారింది.

శుక్రవారం ఆమెను తన రూంకి రమ్మని పిలిచిన అతడి మాటల్ని నమ్మింది. రూంకి వెళ్లగానే.. వేరే వారితో చనువుగా ఉంటున్నావంటూ నిలదీసిన షాహిద్ మాటలతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముందుగానే ప్లాన్ చేసుకున్న షాహిత్.. తండ్రి మటన్ షాపు నుంచి తీసుకొచ్చిన కత్తితో ఆమె గొంతును కోసేశాడు. రక్తం మడుగులో బాధతో విలవిలలాడుతూ మరణించింది.

ఆమె మరణించిన తర్వాత.. రూంకి తాళం వేసి ఇంటికి వెళ్లిన షాహిద్ ను చూసి.. ఇంట్లో వారు కంగారు పడ్డారు.రక్తం మరకలు ఉన్న బట్టలేమిటని ప్రశ్నించారు. తర్వాత మళ్లీ ఇంటికి వస్తానని చెప్పిన అతను.. నేరుగా వరంగల్ జైలుకు వెళ్లాడు. తాను తన ప్రేయసిని హత్య చేసినట్లు చెప్పటంతో అధికారులు షాక్ తిన్నారు. అనంతరం అతడ్ని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అతడ్ని వెంట పెట్టుకొని వెళ్లినపోలీసులు.. రక్తపు మడుగులో ప్రాణాలు విడిచిన బాధితురాలిని గుర్తించారు. బాధితురాలి తల్లిదండ్రులకు వివరాలు తెలపటంతో వారు వచ్చి.. రక్తపు మడుగులో విగతజీవిగా ఉన్న తమ కుమార్తెను చూసి గుండెలవిసేలా రోదించారు. అనంతరం డెడ్ బాడీని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన షాహిద్ ఆర్నెల్లుగా పోలీసు శాఖకు చెందిన ఉద్యోగి ఇంట్లోనే అద్దెకు ఉండటం గమనార్హం. హత్య చేసిన విషయం పక్కన ఉన్న ఇంటి వారికి కూడా తెలీకపోవటం గమనార్హం. పెద్ద ఎత్తున కేకలు వినిపించలేదని పక్క వాటాలో ఉన్నవారు చెప్పారు. తన తండ్రి మటన్ షాపులోని కత్తితోనే ప్రియురాలిని హత్య చేసినట్లుగా నిందితుడు ఒప్పుకున్నట్లు తెలిసింది. ప్రాణంగా ప్రేమించిన యువతిని పొట్టనబెట్టుకున్న ప్రియుడి దుర్మార్గం షాకింగ్ గా మారటమే కాదు.. అనుమానంతో ఆమెను చంపేసిన తీరు షాకింగ్ గా మారింది.