Begin typing your search above and press return to search.

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియ

By:  Tupaki Desk   |   13 Oct 2020 3:30 PM GMT
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియ
X
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఏపీని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే విశాఖ-నర్సాపురం మధ్యలో తీవ్ర వాయుగుండం తీరం దాటి పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంత జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఇక భారీ వర్షాలకు విజయవాడలోని ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. అమరావతి పరిధిలోని అనేక ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది.

భారీ వర్షాలకు విజయవాడలోని దుర్గామాత ఆలయానికి వెళ్లే ఘాట్‌రోడ్డులో మంగళవారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు బండరాళ్లు ఇంకా ఎక్కువగా పడకుండా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు.

విజయవాడలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో కొండపై ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లు విరిగి ఘాట్‌రోడ్డుపై పడ్డాయి. అయితే ఈ సమయంలో వాహనాలు అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఊహించని ఘటనతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.

భారీ వర్షం కురుస్తుండడంతో ఆ సమయంలో భక్తులు ఎవరూ ఘాట్ రోడ్డుపై ప్రయాణించలేదని అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అధికారులు పరిమితంగా వాహనాలను అనుమతించారు. దీంతో పెద్ద ప్రాణ నష్టం తప్పినట్టైంది.