Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ టూర్ ప్యాకేజ్.. దండుకోబోతున్న బ్రిటన్

By:  Tupaki Desk   |   4 Dec 2020 12:30 AM GMT
వ్యాక్సిన్ టూర్ ప్యాకేజ్.. దండుకోబోతున్న బ్రిటన్
X
ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోంది. రష్యా ఇప్పటికే కోవిడ్ పోరులో కీలక పాత్ర పోషిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఇచ్చేసి సామాన్యులకు కూడా టీకా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. బయటికి పూర్తి వివరాలు వెల్లడించకపోయినా.. చైనా సైతం వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఫైజర్ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్‌కు ఆమోద ముద్ర వేసిన బ్రిటన్ ప్రభుత్వం.. వచ్చే వారం నుంచే వ్యాక్సినేషన్ మొదలుపెట్టనున్నట్లు తాజాగా వెల్లడైంది. ఫైజర్ రూపొందించిన వ్యాక్సిన్‌ డోస్‌లు భారీ ఎత్తునే ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో కొన్ని నెలల్లోనే కోట్లాది మందికి వ్యాక్సినేషన్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ప్రభుత్వం తరఫున ప్రజలకు వ్యాక్సిన్లు వేయడంతో పాటు ప్రైవేటుగా కూడా ఎక్కువ ధరకు ఆన్ డిమాండ్ వ్యాక్సినేషన్ చేయడానికి సెంటర్లను పెట్టబోతున్నారట.

ఈ వార్తల నేపథ్యంలో వ్యాక్సిన్ టూర్లతో భారీ ఎత్తున డబ్బులు సంపాదించడానికి టూరిజం వర్గాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. యూకే టూర్ ప్యాకేజీ ఇచ్చి అందులో కోవిడ్ వ్యాక్సినేషన్‌‌ను కూడా కలపనున్నారట. ఇండియా సహా వివిధ దేశాల నుంచి టూరిస్టులను ఆకర్షించేందుకు ఈ ప్యాకేజీలు బాగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఇండియాలో వ్యాక్సినేషన్ ఇంకొన్ని నెలలు సమయం పట్టే అవకాశముంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ముందుగా వైద్య, పారిశుద్ధ్య, ఇతర సిబ్బందికే ప్రాధాన్యం ఇస్తారు. డబ్బులు పెట్టినా వ్యాక్సిన్ వేయించుకోవడానికి కొన్ని నెలలు ఎదురు చూడాల్సిందే.

ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌తో పాటు విహారానికీ అవకాశమిచ్చే యూకే టూర్ ప్యాకేజీలను ఇండియాలోని ధనవంతులు ఎంచుకునే అవకాశముంది. ఎలాగూ కోవిడ్ కారణంగా విహార యాత్రల్లేక జనాలు అల్లాడిపోతున్నారు. కాబట్టి ఈ రకంగా కూడా కలిసొచ్చేదే కాబట్టి ఈ ప్యాకేజీలను పెద్ద సంఖ్యలో ఉపయోగించుకునే అవకాశముంది. కాబట్టి ఈ రూపంలో బ్రిటన్ భారీగానే ఆదాయం దండుకోవడం ఖాయం.