Begin typing your search above and press return to search.

ఈ ఉంగరం వెనుక ఇంత కథ ఉందా?

By:  Tupaki Desk   |   16 Oct 2015 9:40 AM GMT




చేతివేళ్లకు, జీవితానికి సంబంధం ఉంటుందా..? ఉంటుందనే చెబుతారు కొందరు.. అందుకు కారణాలు కూడా చెబుతుంటారు. అంతేకాదు, వివాహబంధం ఎంత దృఢమైనదో కూడా చేతివేళ్లను బట్టి అర్థం చేసుకోవచ్చనీ అంటుంటారు.

చేతి వేళ్లను ఒక్కొక్కదాన్ని కుటుంబంలోని ఒక్కో బంధంతో పోల్చుతారు. బొటన వేళ్లు తల్లిదండ్రులుగా, చూపుడు వేళ్లు అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములుగా చెబుతారు. మిడిల్ ఫింగర్ మనమే. నాలుగో వేలు(రింగ్ ఫింగర్) జీవితభాగస్వామికి సూచన. చిటికెన వేలు పిల్లలకు సంకేతం.

రెండు అరచేతులు ఎదురెదురుగా ఉంచి మధ్య వేళ్లు రెండూ మడిచి అరచేతులను అలాగే పట్టి ఉంచాలి. ఆ పొజిషన్ లో బొటన వేళ్లను ఒకదానికొకటి దూరం జరిపే ప్రయత్నం చేయండి... ఆ రెండూ దూరంగా జరుగుతాయి. చూపుడు వేళ్లూ దూరంగా జరుగుతాయి. చిటికెన వేళ్లూ దూరంగా జరుగుతాయి... కానీ, ఉంగరం వేలు మాత్రం కదపలేం... కారణం దంపతులకు చిహ్నమైన ఆ వేళ్లు అంతగా విడదీయలేనట్లుగా ఉండడం వివాహబంధంలో ఉన్న దృఢత్వానికి చిహ్నం.

ప్రతి మనిషి జీవితంలోనూ తల్లిదండ్రులు ఎంత కీలకమైనా కూడా వారు జీవితాంతం మనతో ఉండరు. అలాగే అన్నదమ్ములు, అక్కచెల్లెల్లు కూడా పెళ్లి చేసుకున్నాక చాలావరకు వేరుగానే ఉంటారు. ఇక పిల్లలు కూడా వారికి పెళ్లిళ్లు అయిన తరువాతో, ఉద్యోగరీత్యానో, చదువుల వల్లో దూరంగా ఉంటారు. భార్యాభర్తలు మాత్రం ఎప్పుడూ కలిసే ఉంటారు. అందుకే దంపతులకు, వివాహబంధానికి సూచనగా ఆ వేలుకే పెళ్లి ఉంగరం తొడుగుతారట.

జీవితానికి, చేతి వేళ్లకు ముడిపెట్టడం బాగుంది కదూ.. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా, ఉంగరం ఆ వేలికే పెట్టే ఆచారానికీ ఇదే కారణం కావచ్చు, కాకపోవచ్చు కానీ వివాహబంధం ఎంత గట్టిదో చెప్పడానికి తీసుకున్న ఈ ఉదాహరణ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. మీరూ మీ చేతివేళ్లతో ఇది ట్రై చేయండి.