Begin typing your search above and press return to search.

ఏడడగులు వేస్తూ అనంతలోకాలకు..

By:  Tupaki Desk   |   15 Dec 2015 10:05 PM IST
ఏడడగులు వేస్తూ అనంతలోకాలకు..
X
చలిగాలులు నవ వధువు ప్రాణం తీశాయి. పెళ్లి పీటలపై ఉన్న వధువు అతి చల్లని గాలుల కారణంగా మృతిచెందిన సంఘటన అందరినీ కలచివేసింది. బీహార్ లోని భక్తియాపూర్ లో ఆదివారం జరిగిన ఈ ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది. అయితే... అగ్నిసాక్షిగా ఏడడుగులు వేస్తున్న సమయంలో మృతిచెందిన వధువు మృతదేహాన్ని వరుడు తన ఇంటికి తీసుకెళ్లి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించాడు.

డిసెంబరు 13న సోని కుమార్ అనే అమ్మాయికి పెళ్లి జరుగుతోంది. ఉదయం నుంచి పెళ్లి తంతు అంతా సాగుతోంది. ఇక కీలక ఘట్టమైన ఏడు అడుగులు వేస్తున్న సమయంలో ఆమె ఎముకలు కొరికే చలిగాలులను తట్టుకోలేక స్పృహ కోల్పోయి పడిపోయింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పారు. దీంతో అంతవనరే కళకళలాడిన పెళ్లి మండపం కన్నీటి సంద్రమైపోయింది.

కాగా దాదాపుగా పెళ్లి తంతు అంతా పూర్తవుతున్న సమయంలో వధువు మరణించడంతో షాక్ గురయినప్పటికీ వరుడు గయానంద్ మాత్రం ఆమె అంత్యక్రియలు తానే నిర్వహిస్తానని ప్రకటించాడు. తన భార్యగా మారిన ఆమె మృతదేహాన్ని తమ ఇంటికి తీసుకెళ్లి అక్కడి నుంచి గంగానదీ తీరానికి చేర్చి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా అతి శీతల గాలుల కారణంగానే పెళ్లి కుమార్తె మృతిచెందిందని వైద్యులు చెప్పారు.